
ప్రజాశక్తి-విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా ఈనెల 29,30,31 తేదీల్లో నిర్వహిస్తున్న విజయనగర ఉత్సవాలను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో జయప్రదం అయ్యేలా చూడాలని రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఉత్సవాల టీజర్ ను, ఆహ్వాన పత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి , జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, మేయర్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండగ మూడు రోజులు నగరం అంతటా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ ఎస్‌ఇ లక్ష్మణ రావుకు సూచించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా సరఫరా ప్రతి రోజు ఉండేలా చూడాలని మున్సిపల్ కమీషనర్ శ్రీ రాములు నాయుడుకు సూచించారు. సిరిమాను అనంతరం భక్తులు తరలి వెళ్ళడానికి అవసరమగు బస్సులను సిద్ధంగా ఉంచాలని, ముఖ్యగా విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, సాలూరు రూట్లలో అదనపు బస్సు ను వేయాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అత్యవసర మందులతో మెడికల్ క్యాంపును, అత్యవసర వాహనాలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒడాక్టర్ భాస్కరరావుకు ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ విఐపి లంతా సోమవారం నాడే దర్శనాలు చేసుకోవాలని తెలిపారు. సిరిమానును సమయానికి ప్రారంభ మయ్యేలా అటవీ శాఖ, దేవాలయ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆహ్వాన పత్రాలను విఐపిలకు, జిల్లా అంతట ప్రజా ప్రతినిధులకు ముందుగానే అందించాలని అన్నారు.
13 వేదికలలో వినోద కార్యక్రమాలు : కలెక్టర్
ఉత్సవాలను మూడు రోజుల పాటు 13 వేదికలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఉత్సవ ప్రారంభోత్సవ ర్యాలీ 29న ఉదయం 8.30 గంటలకు పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి గురజాడ కళాభారతి వరకు జరుగుతుందన్నారు. అనంతరం 11 గంటలకు ఉత్సవ ప్రారంభోత్సవ సభ గురజాడ కళాభారతి వద్ద జరుగుతుందని తెలిపారు. 29, 30 తేదీలలో ఆనంద గజపతి ఆడిటోరియంలో సంగీత నృత్య ప్రదర్శనలు, కచేరీలు, లయన్స్ కమ్యూనిటీ హాల్ లో కర్రసాము, పులి వేషాలు, తప్పెటగుళ్ళు , ధింసా తదితర జానపద కళా రూపాల ప్రదర్శన ఉంటుందన్నారు. కోటలో సైన్సు ఫేర్, సంగీత కళాశాలలో పుష్ప, ఫల ప్రదర్శన ఉదయం 10 నుండి రాత్రి 9 వరకు ఉంటుంద న్నారు. గురజాడ కళాభారతిలో సాంఘిక నాటికలు, ఏక పాత్రాభినయాలు, లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో కవి సమ్మేళనం, సాహిత్య గోష్టి, అష్టావధానం తదితర సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. కోట ముందు ప్రాంతం లో 30వ తేదీ రాత్రి, 31 న సిరిమాను ఉత్సవం అనంతరం పులివేషాల పోటీలు ఉంటాయన్నారు. రాజీవ్ క్రీడా ప్రాంగణంలో పలు క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు. అదే ప్రాంగణంలో 30న బెలూన్ల ప్రదర్శన, గాలి పటాల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. అయోధ్య మైదానంలో 30 న డాగ్ షో, పెట్ షో ఉంటుందని తెలిపారు. కోట ఎదురుగా బొంకుల దిబ్బ గ్రౌండ్స్ లో ప్రఖ్యాత సురభి నాటక ప్రదర్శనలు మాయా బజార్, భక్త ప్రహ్లాద, బాలనాగమ్మ నాటకాలు మూడు రోజుల పాటు ఉంటాయన్నారు.
అయోధ్యా మైదానంలో అనూప్ రూబెన్స్ మ్యూజికల్ నైట్
ఈనెల 30 రాత్రి అయోధ్యా మైదానం లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఆధ్వర్యం లో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో నాటు నాటు ఫేం రాహుల్ సిప్లిగంజ్ , బులెట్ బండి పాట తో పాపులర్ అయిన మోహన భోగరాజు సింగర్స్‌తో పాటు జబర్దస్త్ రామ్ ప్రసాద్, బందం కామెడీ షో ఉంటుందన్నారు. 31 వ తేదీన రాజీవ్ గాంధీ స్టేడియం లో జరిగే బాణా సంచా కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ప్రజలంతా ఈ ఉత్సవాలను వీక్షించి ఆనందం పొందాలని కోరుతున్నట్లు తెలిపారు.
చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ
లోయర్ ట్యాంక్ బండ్‌లో నున్న మన్సాస్ గ్రౌండ్ లో డ్వాక్రా చేనేత ఉత్పతుల ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి 250 స్టాళ్ళ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎపి లో 26 జిల్లాల నుండి ప్రతి జిల్లాకు 3 స్టాల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 28 నుండి నవంబర్ 8 వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ వద్ద ఓపెన్ డయాస్‌లో సాంస్కతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
సమావేశంలో డిప్యూటీ మేయర్ లయ యాదవ్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఇంచార్జ్ ఎస్‌పి అసమా ఫరీన్, డిఆర్‌ఒ అనిత, ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్, అసిస్టెంట్ కమీషనర్ సుధారాణి, జిల్లా పరిషత్ సిఇఒ రాజ్ కుమార్, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి , మున్సిపల్ కమిషనర్ శ్రీ రాములు నాయుడు, పలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.