Nov 21,2021 07:14

మూడు వారాల కిందట ఒక బూతు పద ప్రయోగం చుట్టూ ఎ.పి రాజకీయం కేంద్రీకృతమై టిడిపి వైసీపీ రాష్ట్రపతి పాలన, పార్టీల రద్దు కోరేవరకూ వెళ్లింది. ఆ సందర్భంలో టిడిపి కార్యాలయాలపై దాడులను అందరూ ఖండించారు గాని ఆ పార్టీ రాష్ట్రపతి పాలన కోరడాన్ని ఆమోదించలేదు. పెనం మీద నుంచి పొయ్యి లోకి పడినట్టు ఇప్పుడు బూతు పురాణం కాస్త మహిళలపై, మాజీ ముఖ్యమంత్రి కుటుంబంపై హీన వ్యాఖ్యల స్థాయికి చేరింది. ఒక వైపున చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు వరదలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే శాసనసభ వాటిని చర్చించే బదులు ఈ నిందారోపణల తగాదాలో నిండా మునిగిపోయింది. సభలో తనను అవమానించారని, ప్రకటన చేయబోతుంటే మైక్‌ కట్‌ చేశారని ఆరోపిస్తూ సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు నాయుడు మీడియా గోష్టిలో భోరున విలపిస్తూ ముఖ్యమంత్రిగానే మళ్లీ అడుగు పెడతానని శపథం చేశారు. సుదీర్ఘకాలం పాటు హేమాహేమీలతో పనిచేసి ఎన్నో బాధ్యతలు నిర్వహించిన తనను ఎన్ని అన్నా భరించాను గాని తన భార్యను కూడా కించపర్చడం సహించలేకపోతున్నానని ఆవేదన చెందారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ సభలో మాట్లాడుతూ తమ వారెవరూ ఆమె పేరు తీసుకురాలేదని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడే తన కుటుంబం ప్రస్తావన, తల్లి, చెల్లి, బాబాయి వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడారనీ ప్రత్యారోపణ చేశారు. ఆయన పార్టీ సభ్యులు, మంత్రులు మరో అడుగు ముందుకేసి చంద్రబాబు ఏడుపు నాటకమని అపహాస్యం చేశారు. గతంలో తమపై టిడిపి వారు మాట్లాడిన వాటిని రోజా వంటి వారు ఏకరువు పెట్టారు. తెలుగుదేశం నాయకులు కూడా తీవ్ర భాషలో ఉద్రేకపూరితంగా మాట్లాడటం కొనసాగించారు. రైతాంగ వ్యతిరేక శాసనాల రద్దుపై దేశమంతా చర్చిస్తుంటే రాష్ట్ర శాసనసభ ఈ చవకబారు రభసలో చిక్కుకు పోవడం సిగ్గుచేటు.
పరస్పర నిందారోపణలు
రాజకీయ వాదోపవాదాలు ఆరోపణలలో కుటుంబ సభ్యులను అందులోనూ మహిళలను తీసుకురావడం బొత్తిగా అనుమతించరాని విషయం. మూడు వారాల కిందట బూతు పంచాయతీ నేపథ్యంలో వైసీపీతో వుంటున్న ఒక ఎంఎల్‌ఎ ఈ విషయమై జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారు. నాలాంటి వాళ్లం వాటిని అప్పుడే ఖండించాం. శాసనసభలో వ్యవసాయ విధానంపై చర్చ మంత్రి కన్నబాబు ప్రసంగం సందర్భంలో టిడిపి వారు ఏదో అనడం, దానిపై పలువురు మంత్రులు సభ్యులు మాట్లాడటం ఇలా అంతా అదుపు తప్పిపోయింది. ఆ ప్రసారం చాలావరకూ అందుబాటులో వుంది గనక పరిశీలించవచ్చు కూడా. టిడిపి వారి మాటలపై తమవారు స్పందించారు తప్ప చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లు తీసుకురాలేదని ముఖ్యమంత్రితో సహా పాలకపక్షం సమర్థనగా వుంది. వివేకానందరెడ్డి హత్య, గొడ్డలి, తల్లీ చెల్లికి జగన్‌ అన్యాయం చేయడం వంటి వ్యాఖ్యలు చంద్రబాబు నుంచి వచ్చాయి. వంగవీటి రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ వంటి వారి హత్యల గురించీ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేసిన నాటి పరిస్థితులు వైసీపీ వారు తీసుకొచ్చారు. ఇందులో మాధవరెడ్డి ప్రస్తావన గతంలో ఎంఎల్‌ఎ చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలతో ముడిపడి వుందని అందరికీ తెలుసు. వైసీపీ సభ్యులు ఇద్దరు అసభ్యమైన వ్యాఖ్యలు చేశారనీ ఆధారాలు వున్నాయని టిడిపి చెబుతున్నది. పరస్పరం అరుచుకునే సమయంలో మాటలు అన్నది నిజమేనని అది సాధారణంగా జరుగుతుంటుందని వారిలో ఒకరు ఛానల్‌కు చెప్పారు కూడా. కనుక అక్కడ అనుచితమైన వ్యాఖ్యలు నిందారోపణలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చాయన్నది నిర్వివాదాంశం. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి, స్పీకర్‌ బాధ్యత.
బహిష్కరణ కాదు, పరిష్కరణ ముఖ్యం
తాజా దఫా స్థానిక ఎన్నికలలో కుప్పంతో సహా వైసీపీ విజయాలు సాధించిన నేపథ్యంలో ఒకరోజు శాసనసభ సమావేశాలు అన్నప్పటి నుంచి వివాదాలు రగులుకుంటాయని ఊహించడం జరుగుతూనే వచ్చింది. కాని అవి ఇంత వికృతరూపం తీసుకుంటాయనే అంచనా చాలా మందికి లేదు. తనకు చంద్రబాబు మొహం చూడాలని వుందని ముఖ్యమంత్రి బిఎసి సమావేశంలో అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు మొదటి రోజు సభకు హాజరుకాలేదు. బిఎసి సమావేశంలో ప్రతిపక్షం కోర్కె మేరకు ఒకరోజు అనుకున్న సమావేశాన్ని 26 వరకూ పొడగించారు. రెండవరోజు చంద్రబాబు వచ్చాక ఆది లోనే హంసపాదులా మారింది. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా వున్న జగన్‌ కూడా సభను బహిష్కరించడమేగాక చివరి ఏడాది వైసీపీ మొత్తంగా హాజరు కాలేదు. వైసీపీ అధికారం లోకి వచ్చాక టిడిపి కూడా మొత్తంగా బహిష్కరించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా సభను బహిష్కరిస్తూ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన ఇతరులు వెళతారా లేదా అనేది మొదట్లో కొంత సందేహంగా వున్నా తర్వాత వారు కూడా బహిష్కరిస్తారని మీడియాకు వెల్లడించారు. పూర్తి స్పష్టత అధికారికంగా రావలసి వుంది. ఈ రెండు పార్టీలు ఈ విధంగా రాజకీయ వైరాలతో సభను బహిష్కరించడం, జరిగినప్పుడు కూడా సమస్యలపై చర్చ గాక వ్యర్థ వివాదాలతో కాలం వృథా కావడం బాధాకరం, నష్టదాయకం. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పని చేయడం పాలక ప్రతిపక్షాల బాధ్యత. అసాధారణ పరిస్థితులలో తప్ప సభను బహిష్కరించడం ప్రత్యామ్నాయం కాదు. దానివల్ల అర్ధవంతమైన చర్చ, సరైన నిర్ణయాలు సాధ్యం కాదు. పైగా ప్రజలు మనకు అప్పగించిన బాధ్యతను కూడా నెరవేర్చినట్టు కాదు. ఇక్కడ తప్పుగా మాట్లాడిన వారిపై చర్య తీసుకోవడం ముఖ్యం తప్ప సభ నుంచి వెళ్లిపోవడం సరైన ప్రతిస్పందన అవుతుందా? శాసనసభ కాల వ్యవధి ఇంకా సగం మిగిలి వుంటే దాన్ని వినియోగించుకోకుండా ప్రధాన ప్రతిపక్షం ప్రజల సమస్యలపై ఎలా పోరాడుతుంది? గతంలో వైసీపీ నిర్ణయం పొరబాటన్నట్టే ఇప్పుడు కూడా టిడిపి నిర్ణయం మార్చుకోవడం మంచిది. గతంలో ఉమ్మడి ఎ.పి లో ఎన్టీఆర్‌, తమిళనాడులో జయలలిత వంటి వారు కూడా అధికారం వచ్చాకే సభ లోకి వస్తామని శపథాలు చేసిన మాట నిజమే. ముఖ్యమంత్రిగా మళ్లీ రావడం అన్నది వచ్చే ఎన్నికలలో ప్రజల నిర్ణయానికి సంబంధించిన విషయం తప్ప ఈ సభా కాలంలో బాధ్యతా నిర్వహణ చేయవలసిందే.
బాధ్యులపై చర్యలు అవశ్యం
ఎన్నికలలో గెలుపు ఓటములు శాశ్వతం కావని అధికార పక్షం కూడా గుర్తించాలి. ప్రతిపక్షాల విమర్శలు ప్రజా ఉద్యమాలను గౌరవిస్తూ ప్రధానాంశాలపై కేంద్రీకరించాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధన, అప్పుల భారం, విభజన సమస్యల పరిష్కారం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు వంటి ఎన్నో సవాళ్లు వున్నాయి. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ప్రజలపై విధించిన కొత్త భారాలూ వున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు చట్టాలపై హైకోర్టులో విచారణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అమరావతి పాదయాత్ర కొనసాగుతున్నది. ఇటీవల తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో కోర్కెల జాబితా వినిపించినా ఎలాంటి నిర్దిష్ట హామీలు లభించింది లేదు. తర్వాత తమ పార్టీ వారితో జరిపిన సమావేశంలో అమిత్‌ షా వైసీపీని టిడిపి ని దెబ్బ తీసి బిజెపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వుండాలని రాజకీయ గీతోపదేశం చేసి వెళ్లారు. అమరావతి ఏకైక రాజధానిగా వుండాలనే రాష్ట్ర శాఖ తీర్మానం మేరకు పాదయాత్రలో పాల్గొనాలని ఆయన ఆదేశించినట్టు చెబుతున్నారు. అయితే అదే మాట కేంద్ర నాయకత్వం జగన్‌ ప్రభుత్వంతో చెప్పకపోవడం కపటనీతికి దర్పణం. పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం నేత బి.వి రాఘవులు ఈ ద్వంద్వ వైఖరిని సూటిగానే ఎండగట్టారు. తమ తమ రాజకీయాలు ఏవైనా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని, ఈ కపటనీతిని ఎదుర్కొని రాష్ట్రం కోసం ఉమ్మడిగా పోరాడవలసింది పోయి ఈ రెండు పార్టీల వివాదాలతో రాజకీయ కాలుష్యం పెంచడం దారుణం. ఏతావాతా సమస్యలపై గాక పరస్పర నిందారోపణలు, వ్యక్తిగత దూషణ భూషణలకే పరిమితం కావడం చైతన్యవంతమైన ఎ.పి ప్రజాస్వామిక సంప్రదాయాలకు విరుద్ధమైన పరిణామం. గతంలో ఎన్నడూ ఈ స్థాయికి రాజకీయాలు దిగజారింది లేదు. సహజంగానే ఈ తరహా దాడులకు కులాలు, కుటుంబాలు, మహిళలు లక్ష్యమవు తున్నారు. శ్రుతి మించిన ఈ పరిస్థితికి పరాకాష్ట శాసనసభ పరిణామాలు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జగన్‌, సభాపతి తమ్మినేని సీతారాం ఇందుకు కారకులపై చర్యలు తీసుకోవాలి.
రెచ్చగొట్టే పోకడలపై అప్రమత్తత
రాజకీయంగానే గాక మీడియా లోనూ సోషల్‌ మీడియా లోనూ చర్చలలో ప్రసారాలలో ఒకరిపై ఒకరి విశృంఖల కథనాలు, తిట్లు రివాజుగా మారాయి. పెద్ద పార్టీల పోషణ కూడా వీటికి లభిస్తున్నది. కులాల కుళ్లు చెలరేగి సిపిఐ, సిపిఎం నాయకుల పైన కూడా నచ్చనప్పుడల్లా ఇష్టానుసారం కథనాలు, ట్రోల్స్‌ సర్వసాధారణమైనాయి. స్థానిక తగాదాల నుంచి ఘోరమైన హత్యల వరకూ ఈ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలకు వనరులవుతున్నాయి. వాటిపై మళ్లీ చర్చల పేరిట రభసలు, చెప్పులను చూపించడాలు, చెప్పులతో కొట్టుకోవ డాలు ఆఖరుకు న్యాయమూర్తుల పైన కూడా ఇష్టానుసారం పోస్టులు పెట్టడం, సిబిఐ దర్యాప్తు వరకూ వెళ్లినా విదేశాల నుంచి కూడా ఇంకా కొనసాగిస్తున్న స్థితి. వీటిలో కొన్నిటిపై తీవ్రంగా విరుచుకుపడే దర్యాప్తు అధికారులు ఇతరమైన వాటిని ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధం కాదు. వైసీపీ టిడిపి తమ తమ రాజకీయ ఎజెండాలను పార్టీలకు పరిమితం చేసుకుని విశాల రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ముందు ఎవరు, ఎక్కువ ఎవరు వంటి మీమాంసలతో ఈ కాలుష్యాన్ని మరింత పెంచుకోవడం దుర్భరం. కుల, మత, వ్యక్తిగత అంశాలపై రెచ్చగొట్టేందుకు కాచుకుని కూచున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తత వహించాలి. మోడీ ప్రభుత్వం దిగివచ్చి రైతాంగ వ్యతిరేక శాసనాలను వెనక్కు తీసుకునేలా చేసిన ఉద్యమాల స్ఫూర్తితో విశాఖ ఉక్కును కాపాడుకోవడం ఇతర సమస్యలు పరిష్కరించుకోవాలి. శాసనసభలో ఉద్రిక్తతలు, బహిష్కరణ ప్రకటనలపై సభాపతి రంగం లోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

                                                                           -  తెలకపల్లి రవి