Aug 13,2023 21:46

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సివిల్‌ సప్లయీస్‌ హమాలీల సమస్యలు పరిష్కరించాలని హమాలి వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని షాదీఖానాలో ఆదివారం నిర్వహించిన హమాలీల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్కర్లకు సమగ్ర చట్టం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయాని విమర్శించారు. హమాలీలకు పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగినా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. చట్టపరమైన సౌకర్యాలైన ఆరోగ్య బీమా అమలు చేయడం లేదని, కూలి రేట్ల కోసం పదేపదే పోరాడాల్సి వస్తోందని చెప్పారు. ఎమర్జెన్సీ డ్యూటీ అని ఒక పక్క చెబుతూ రెండో పక్క వారి సమస్యలను మాత్రం ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అన్నారు. కూలి డబ్బులు నెల చివరి వరకూ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాగునీటి కింద నెలకు రూ.600 ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని తెలిపారు. ఈ సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు, సివిల్‌ సప్లయీస్‌ హమాలీ ముఠా కార్మికులు సంపత్‌, వెంకటకృష్ణ , టంకయ్య, నాగేశ్వరరావు, శేషారావు, ఎం.సైదులు, భూపతిరావు, నరసింహారావు, అంకారావు పాల్గొన్నారు.
ముగిసిన వర్క్‌షాప్‌
షాదీఖానాలో రెండ్రోజులపాటు నిర్వహించిన సిఐటియు జిల్లా వర్‌కషాప్‌ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శులు షేక్‌ ముజఫర్‌ అహ్మద్‌, కె.ఉమామహేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చిందని, వీటి వల్ల కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదే విధానాలను రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ నేపథ్యంలో కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని, సిఐటియు పోరాటాల్లో కార్మికులు పెద్దఎత్తున కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, నాయకులు జి.విజరుకుమార్‌, జి.రవి, షేక్‌ సిలార్‌, బి.మహేష్‌, పి.శ్రీనివాసరావు, జి.మల్లేశ్వరి, డి.శివకుమారి, టి.శ్రీనివాసరావు, షేక్‌ బందగి, హరిపోతురాజు పాల్గొన్నారు.