ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్) క్యాజువాల్టిని రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. క్యాజువాల్టి, ఇతర విభాగాలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన తొలుత ఇంటి నుంచి ఉదయం నేరుగా క్యాజువాల్టీ చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిరాటకంగా తనిఖీ లు చేశారు. అత్యవసర విభాగం వద్ద అంబులెన్స్‌లు, కార్లు, ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. వాహనాలను నియంత్రణకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు. సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రవేశ ద్వారం పూర్తిగా తెరవకుండా సగం తలుపులు తెరిచి ఉంచటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపీ రిజిస్ట్రేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక్కరే ఉండటంపై అయన అసహనం వ్యక్తం చేశారు. రోజుకు వందల సంఖ్యలో రోగులు వస్తుంటే ఒక్క ఆపరేటరే ఎలా సరిపోతారని నిర్వాహకుడు బాలకృష్ణను ఫోన్‌లోనే ప్రశ్నించారు. ఈ-రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో ప్రింటర్లను ఏర్పాటు చేసి ఆపరేటర్లు ఇద్దరినీ నియమించాలన్నారు. రోగి సమాచారం తీసునేటప్పుడు ఆధార్ నంబర్‌తో పాటు ఫోన్ నంబర్ కూడా తీసుకోవాలని సూచించారు. ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని సూపరింటెండెంట్ దృష్టికి పోలీసులు తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇసిజి గదిలో ఇసిజి టెక్నిషియాన్‌గా ఒక స్టూడెంట్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెండు ఇసిజి మిషన్‌లు ఒక మిషన్ పని చేయడం లేదని సిబ్బంది చెప్పడంతో మరమ్మతులకు ఆదేశించారు. మహిళలకు పరీక్షలు చేసే సమయంలో ఒక నర్సుతో పాటు మహిళా సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలన్నారు. క్యాజువాల్టీ ట్రఏజ్ ఐసియు అస్తవ్యస్తంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన మంచాలు లేకపోవడంతో వెంటనే వర్క్‌షాపు నుంచి 5 పడకలను తేవాలని ఆదేశించగా సిబ్బంది వాటిని ఏర్పాటు చేశారు. మానిటర్లు కూడా పని చేయడం లేదని గుర్తించారు. ఉన్నా రెండు మానిటర్లు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐసియులో బెడ్‌కు ఒక్కొక్క మానిటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్‌కు సహాయం చేస్తూ రోగిని వెంటనే వార్డుకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరంగా రోగులను చూసేందుకు సిపిఆర్ చెయ్యడానికి ఎమర్జెన్సీ డాక్టర్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని క్యాజువాల్టి డాక్టర్ రాధికకు ఫోన్ చేసి వెంటనే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను నియమించాలని ఆదేశించారు. క్యాజువాల్టీ విభాగంలో మైనర్ ఆపరేషన్ థియేటర్‌లో సదుపాయాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే థియేటర్‌కు అవసరమైన విద్యుత్ లైట్లు ఇతర సౌకర్యలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసరంగా ఆపరేషన్‌లు చేసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంచాలన్నారు. కాన్పుల వార్డులో రోగులకు ఏర్పాటు చేసిన బాత్‌రూమ్‌లు అస్తవ్యస్తంగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల సహాయకులు ఎక్కువ సంఖ్యలో వెళ్లడం వల్ల దుర్వాసన వస్తోందన్నారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని నియమించి రోగుల సహాయకులను నియత్రించాలని సూచించారు.
కాన్పుల వార్డులో కడుపులో బిడ్డ చనిపోయి ఉన్న తల్లిని ఆయన పరామర్శించారు. ఆమెకు అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగారు. 24 గంటల ఆల్ట్రాసౌండ్ గదిని పరిశీలించి అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అందుబాటులో ఉండాలని సూచించారు. క్యాజువాల్టిలో ఉన్న రోగులకు సత్వరమే వైద్య సేవల కోసం వార్డులోకి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌గా కొత్తగా బాధ్యతలు స్వికరించిన డాక్టర్ ఎం.గోవింద నాయక్ ఐసియు రోగులను వార్డుల్లోకి పంపించే విధంగా చేయాలనీ ఆయన ఆదేశించారు. చోరీలను అరికట్టెందుకు అవసరమైన చోట సిసి కెమెరాలను ఏర్పాటు చేయాన్నారు. సూపరింటెండెంటి వెంట అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రావణ్ కుమార్, నర్సింగ్. సూపరింటెండెంట్ షేక్ షమీన బేగం, బయో మెడికల్ ఇంజినీర్ చంద్రశేఖర్ ఉన్నారు.










