ప్రజాశక్తి-పెదబయలు:ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైధ్యాదికారులను ఆదేశించారు. మంగళవారం పెదబయలు మండలం రూడకోట పంచాయతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలకు అవసరమైన్ వ్యాధి నిరోధక మందులను ముందుగానే తెప్పించుకోవాలని, పిల్లల ఆరోగ్య భాధ్యతలను వైద్య సిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి వారు అందిస్తున్న సేవలపై ఆరా తీసారు. రెవెన్యు సేవలు సకాలంలో అందిం చాలన్నారు. ముఖ్యంగా మ్యుటేషన్లు వెంటనే పూర్తి చేసి, అటవీ హక్కుల పత్రాలకు అర్హులను గుర్తించి లబ్ది చేకూర్చే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడంభీరు, రుండలంపుట్టు, పెదలోవ, పాత రూడకోట గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఆయా గ్రామాలలో రోడ్డు, తాగు నీరు సదుపాయాలపై ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా రుండాలంపుట్టు లో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ల ఏర్పాటుకు అంచనాలు తయారు చెయ్యాలని ఆదేశించారు. పెదలోవ నుండి రూడకోట వరకు నాలుగు చక్రాల వాహనాలు వెళ్ళే అవకాశం లేనందున, గ్రామ సర్పంచ్ తో ద్విచక్ర వాహనంపై సుమారు మూడు కిలో మీటర్లు ప్రయాణం చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో డిఎమ్ హెచ్‌ఓ జమాల్ బాషా, అదనపు డిఎమ్ హెచ్‌ఓ లీలా ప్రసాద్, తహసిల్దార్ ఓ.శ్రీనివాసరావు, ఎంపిడిఒ బి.విడ్జిల్స్, ఎంపిటిసి వంటరి సంగీత, సర్పంచ్ సురేష్, గిరిజన సంక్షేమ, ఆర్ డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
అడుగుల పుట్టులో గడప గడప కు మన ప్రభుత్వం
అడుగుల పుట్టు గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పార్టీ జెండా ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. మంచినీరు, పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. పట్టాలు మంజూరు చేయాలని తహశీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు. తమరాడ వడ్డెకోడాపుట్టు గ్రామల్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విగేష్, సీడీపీఓ ఎన్. రాజ్యలక్ష్మి, వైస్సార్సీపీ ఆగ్రో డైరెక్టర్ వనాల్బ సన్యాసి, బిసి వైస్సార్సీపీ మండల ప్రెసిడెంట్ మొగలిపురి రాధ, మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పాంగి సింహాచలం పాల్గొన్నారు.










