Feb 25,2023 01:54
ఫల్లింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించి కారుకు ఆయిల్‌ నింపుతున్న ఆర్‌టిసి ఇడి

ప్రజాశక్తి-వేటపాలెం: ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ముందుంటుందని ఆ సంస్థ నెల్లూరు జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె ఆదం సాహెబ్‌ తెలిపారు. మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ స్థానిక ఎపిఎస్‌ ఆర్‌టిసి బస్టాండ్‌లో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఫిల్లింగ్‌ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇడి ఆదం సాహెబ్‌ మాట్లాడుతూ ప్రయాణికులతో పాటు ప్రజా సేవకు సంస్థ వనరులను వాణిజ్యానికి కేటాయిస్తుందన్నారు. ఎక్కువగా ఆర్‌టిసి బస్టాండ్‌ల్లోని ఖాళీ స్థలాలను లీజులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లకు, పదేళ్లకు, 33 సంవత్సరాలకు మూడు కేటగిరీలుగా విభజించి ఖాళీ స్థలాలను అద్దెకు ఇస్తున్నట్లు వివరించారు. నాణ్యత, మన్నిక గల ఆయిల్‌ సరఫరా చేయడానికి ప్రజల ముందుకు ఐఒసి ద్వారా ముందుకు వచ్చిందన్నారు. కార్గోలో ప్రతి సంవత్సరం రూ.250 కోట్ల రాబడి ఉందన్నారు. రానున్న సంవత్సరానికి రూ.500 కోట్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆర్‌టిసి కార్పొరేషన్‌ వాణిజ్యపరంగా ముందు వరుసలో నిలిచేందుకు ప్రజలందరూ సహాయ సహాకారాలు అందించాలని కోరారు. నెల్లూరు జోన్‌లోనే మొదటి ఫిల్లింగ్‌ స్టేషను వేటపాలెంలో నెలకొల్పినట్లు చెప్పారు. ప్రజల్లో ఆర్‌టిసి సంస్థ పట్ల ఉన్న ఆదరణ చెక్కు చెదరనిదని అన్నారు. అనంతరం వేటపాలెం బస్‌స్టేషన్‌లో ఫిల్లింగ్‌ స్టేషన్‌కు పోగా మిగిలిఉన్న ఖాళీ ప్రాంగణం మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని స్థానిక స్బిందిని ఆదేశించారు. ఉదయం 8-45 గంటలకు చీరాల డిపో మేనేజర్‌ జంజనం శ్యామలకుమారి పూజ చేసి ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశారు. అనుకున్న సమయానికి రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభం కావడంతో ఆర్‌టిసి సంస్థ, ఐఒసి సిబ్బంది మాత్రమే మిగిలారు. ఈ కార్యక్రమంలో డిపిటిఒ వై విజరు కుమార్‌రెడ్డి, కమర్షియల్‌ ఛీఫ్‌ మేనేజర్‌ పి చంద్రశేఖర్‌, డిప్యూటీ సిఎంఇ ఎన్‌ శ్రీనివాసరావు, రేపల్లె డిఎం సుందరం, అద్దంకి డిఎం రామ్మోహన్‌రావు, బాపట్ల డిఎం అజిత్‌ కుమారి, నెల్లూరు ఇడి ఆఫీస్‌ డిఎం దేవరపల్లి శ్రీనివాసరెడ్డి, సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎఇ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్‌ డిఇ శ్రీనివాసులు, ఐఒసి సేల్స్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, ఆర్‌టిసి జిల్లా సెక్యురిటీ ఇన్‌చార్జి కె శ్యామ్‌బాబు పాల్గొన్నారు.