
ప్రజాశక్తి - పాలకోడేరు
వందేళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఆ సర్వేపై దృష్టి పెట్టలేదని, వైసిపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ సర్వే చేస్తుందని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు) అన్నారు. రీ సర్వే పూర్తయిన వేండ్ర, వేండ్ర అగ్రహారం గ్రామాల్లో భూ యజమానులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంపిపి చంటిరాజు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. రీ సర్వే వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. భూములు సర్వే చేసి రాళ్లను కూడా ప్రభుత్వమే వేస్తుందని తెలిపారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తహశీల్దార్ షేక్‌హుస్సేన్, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణరాజు, ఆర్‌ఐ నాగభూషణం నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేండ్ర సర్పంచి కడలి నాగేశ్వరి వీరబాబు, ఉప సర్పంచి భూపతిరాజు సుబ్బరాజు, ఎంపిటిసి సభ్యులు పాల జ్యోతి, వైసిపి గ్రామ అధ్యక్షులు సానబోయిన వేణు, విఆర్‌ఒ అలేఖ్య , మల్లేశ్వరరావు, లెనిన్, సత్యనారాయణ, భూ యజమానులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు
అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నామని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణరాజు (చంటి రాజు) అన్నారు. వేండ్ర అగ్రహారంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తున్న ఘనత వైసిపికే దక్కుతుందన్నారు. కుల, మత బేధాలు లేకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కడలి విజయలక్ష్మి, వైసిపి నాయకులు సుబ్రహ్మణ్యం, దొరబాబు, రాంబాబు, కుడిపూడి శ్రీను పాల్గొన్నారు.