May 10,2023 01:41
నిందితుడిని ఒంగోలు జైలుకు తరలించిన పోలీసులు (ఫైల్‌)

ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలోని మంకెనవారిపాలెంలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మంకెన జయరావుకు యావజ్జీవ కారాగార జైలు శిక్ష పడింది. ఒంగోలు పోస్కో రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎంఎ సోమశేఖర్‌ తీర్పు ఇచ్చినట్లు మంగళవారం జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. వేటపాలెంలోని మంకెనవారిపాలెంలో తన తల్లిదండ్రులతో పాటు నివాసం వుంటూ 3వ తరగతి చదువుకుంటున్న 8 ఏళ్ల వయస్సు గల మైనర్‌ బాలికను వారి ఇంటి సమీపంలో ఉండే మంకెన జయరావు తేది 04.01.2022న ఇంట్లోకి పిలిచి బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తాను అని బెదిరించి, కర్రతో కొట్టినట్టు, ఆ తరువాత భాదితురాలు తనపై జరిగిన లైంగిక దాడి గురించి తన చిన్నమ్మ అయిన ఫిర్యాది ఆండ్ర కిరణ్మయికి తెలియపరచగా, ఆమె బాధితురాలిని వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొనిపోయి, ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం భాదితురాలని ఒంగోలు రిమ్స్‌ హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లి, జరిగిన విషయం పోలీస్‌ వారికి స్టేట్మెంట్‌ ఇచ్చినది. ఫిర్యాది ఇచ్చిన స్టేట్మెంట్‌ మేరకు వేటపాలెం ఎస్‌ఐ జి సురేష్‌ 09.01.2022న కేసు నమోదు చేశారు. అప్పటి చీరాల డిఎస్‌పి పి శ్రీకాంత్‌ దర్యాప్తు ప్రారంభించి, భాదితురాలిని, ఫిర్యాదిని, ఇతర సాక్షులను విచారించుకొని వారి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యాచారం జరిగినప్పుడు భాదితురాలు ధరించిన దుస్తులను పోలీస్‌ ప్రొసీడింగ్స్‌ మేరకు స్వాధీన పరుచుకున్నారు. అదే రోజు నేర స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై మోపబడిన నేరం రుజువువైన అనంతరం అతడిని అరెస్ట్‌ చేసి అతడి ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకొని అతడిని జైలుకు పంపారు. నేర స్థలంలో నుంచి ముద్దాయి, బాధితురాలి దగ్గర నుంచి సేకరించిన భౌతిక సాక్ష్యాధారాలను నిపుణులు పరిశీలించి వారు ఇచ్చిన నివేదికను పొందుపరిచి సంబంధిత కోర్టులో ఛార్జ్‌షీట్‌ వేశారు. ఈ కేసును బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్వయంగా పర్యవేక్షించారు. బాధితురాలికి చదువు, ఇతర అలవెన్స్‌ల నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇచ్చేవిధంగా, అలాగే ముద్దాయి చెల్లించే ఫైన్‌ డబ్బులు కూడా బాధితురాలికి ఇవ్వమని న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు బాలికలపై, మహిళల మీద జరుగుతున్న నేరాలను వేగంగా దర్యాప్తు చేసి నిర్ణీత గడువులోపు సంబంధిత కోర్టులలో ఛార్జిషీట్‌ దాఖలు చేసి, కోర్టులో జరుగుతున్న విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ, సాక్షులకు తగిన రీతిలో భయం లేకుండా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదు ఇవ్వడం వల్లనే కేసులలో నిందితులకు శిక్షలు పడుతున్నాయన్నారు. మహిళలపై జరిగే నేరాల మీద ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కోర్టు ట్రైల్‌ మానిటరింగ్‌ జరుగుతుందన్నారు. అందువల్లనే ఏ కేసులోనూ ముద్దాయి తప్పించుకొనే ఆస్కారం లేకుండా బలమైన సాక్ష్యాలను న్యాయస్థానం ముందు ఉంచగలుగుతున్నామన్నారు. మహిళల మీద, బాలికల మీద చెడు ఉద్దేశంతో ప్రవర్తించేవారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతంగా చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేసి, భౌతిక సాక్ష్యాధారాలను కోర్టు వారికి సమర్పించి, కేసు నమోదు చేసిన సంవత్సర కాలంలోనే ముద్దాయికి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులను, కోర్టు మానిటరింగ్‌ సిబ్బంది, పిపిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.