Aug 08,2023 22:55

నిందితుడు పిల్లి నాగేంద్రబాబు అలియాస్‌ మోజస్‌


ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌, పర్చూరు
పర్చూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. నిందితుడు పిల్లి నాగేంద్రబాబు అలియాస్‌ మోజస్‌కు 13 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేలు జరిమానాను విధిస్తూ ఒంగోలు 2వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్‌ తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాధితురాలు చీరాల నుంచి పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి అరటికాయలు, మల్లెపూలు తీసుకొని వచ్చి అమ్ముకొని సాయంత్రానికి తిరిగి ఇంటికి వెళ్లేది. 2021వ సంవత్సరం జులై నెల 12వ తేదీన సాయంత్రం 6 గంటలకు అడుసుమల్లి నుంచి పర్చూరుకు రావడానికి గుంటూరు వైపు నుంచి వస్తున్న ఆటోలో ఎక్కగా అందులో బాధితురాలు ఒక్కతే ఉండడంతో నిందితుడు అయిన ఆటో డ్రైవర్‌ తన ఆటోను దేవరపల్లి గ్రామ పొలాలలోకి వేళ్లే డొంకదారిలోకి తీసుకువెళ్లి బాధితురాలిని చంపుతానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని పర్చూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు అప్పటి ఇంకొల్లు సిఐ పి సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒంగోలు 2వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలతో బాపట్ల డిఎస్‌పి టి వెంకటేశులు సూచనలతో, మార్టూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ టి ఫిరోజ్‌, పర్చూరు ఎస్‌ఐ ఎన్‌సి ప్రసాద్‌, కోర్టు కానిస్టేబుల్‌ ఎమ్‌ కిరణ్‌ కుమార్‌లు సాక్షులు నిర్భయంగా కోర్టులో సాక్ష్యం చెప్పేవిధంగా తర్ఫీదు ఇచ్చి సరైన సమయంలో కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. నిందితుడిపై మోపబడిన నేరాన్ని తగిన సాక్ష్యాధారాలతో రుజువు చెయ్యడంతో ఒంగోలు 2వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్‌ నేరస్తుడికి 13 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
సత్ఫలితాలిస్తున ట్రయిల్‌ మానిటరింగ్‌ విధానం :ఎస్‌పి
ట్రయిల్‌ మానిటరింగ్‌ చేసి నిందితుడికి జైలు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకూల్‌ జిందాల్‌ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి హెచ్చరించారు. రాష్ట్ర డిజిపి కే రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలతో మహిళ సంబంధిత నేరాలలోని నిందితులకు జైలు శిక్షపడే విధంగా సంబంధిత కేసులలో పోలీస్‌ అధికారులు ఎప్పటికప్పుడు ట్రయల్‌ మానిటరింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. ఈ కోర్టు ట్రయల్‌ మానిటరింగ్‌ విధానం సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. పోలీస్‌ అధికారులే స్వయంగా కోర్టు ట్రయల్‌ను పర్యవేక్షించడం వలన గతంతో పోలిస్తే ప్రస్తుతం కోర్టులో విధించే శిక్షల శాతం పెరిగిందని అన్నారు. జిల్లా ప్రజలు వారి మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఏదైనా అనుకోని ఆపద సంభవించినప్పుడు దిశ ఎస్‌ఒఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని రక్షణ కల్పిస్తారని అన్నారు. దిశ యాప్‌ మీ మొబైల్‌లో ఉంటే మీకు రక్షణగా పోలీసులు మీ వెంట ఉన్నట్లేనని జిల్లా ఎస్పీ తెలిపారు.