ప్రజాశక్తి-అరకులోయ రూరల్:అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అరకులోయ సిఐ జీడి బాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డుంబ్రిగుడ మండలం కోల్లపుట్ పంచాయతీ నందివలస గ్రామానికి చెందిన జన్ని రాంచందర్ (19) అదే గ్రామానికి చెందిన సావిత్రిని రెండో వివాహం చేసుకుంటానని వేధించేవాడని, ఇందుకు ఆమె నిరాకరించి హైదరాబాదులో ఉంటున్న తన సోదరీ వద్దకు వెళ్లి పొట్ట కూటి కోసం కూలి పని చేసుకునేదని తెలిపారు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన సావిత్రి వెంట రామచందర్ పడే వాడన్నారు. అయినా తన మాటలు వినలేదని ఆమె స్నేహితురాలితో కబురు చెప్పి తన ఆండ్రాయిడ్ మొబైల్ తెప్పించుకున్నాడన్నారు. ఆమెను కొండపైకి తీసుకు రమ్మని తన స్నేహితురాలికి చెప్పడంతో కొండపైకి వెళ్లారని, రామచందర్ మద్యం మత్తులో ఉండి ఆమెపై అత్యాచారం చేసి ఆ తరువాత పురుగుల మందు కూల్ డ్రింక్‌లో కలిపి ఆమెకు ఇచ్చి మిగిలిన కొంచెం అతను కూడా సేవించాడన్నారు. పరిస్థితి విషమించి అక్కడే ఆమె మృతి చెందిందని, అపస్పారక స్థితిలో ఉన్న రామచందర్‌ను గ్రామస్తులు గుర్తించి అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారని, దీంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడన్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రామచందర్ విఆర్‌ఓ వద్దకు వెళ్లి లొంగిపోయాడన్నారు. దీంతో తాము అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్, మృతురాలి బట్టలు సీజ్ చేశామన్నారు. హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తెలిసినట్లు సిఐ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ సమావేశంలో డుంబ్రిగూడ ఎస్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.










