Apr 30,2022 07:48

నిన్న ....గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామంలో మరో మహిళ హత్య గావించబడింది
మొన్న....ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం గురవాయిగూడెం రెవిన్యూ పరిధిలో తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న గిరిజన మహిళల పైన దాడి చేసి వస్త్రాలను చించి జామాయిల్‌ పంటను తీసుకుపోయారు. చివరగా వెళుతున్న ట్రాక్టర్లను ఆపి పంటను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఎవరైతే గిరిజన మహిళలపై దాడి చేశారో, వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపి అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాల్సిన పోలీసులు బాధితులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌లో పెట్టారు.
చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో ఇలా రాష్ట్రంలో చాలా చోట్ల అనేక ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో మహిళలు, దళిత, గిరిజనులపై అత్యాచారాలు, హత్యలు , దాడులు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది.
2024 ఎన్నికల్లో 175 సీట్లు ఎలా సాధించాలి? అనే విషయంపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి శ్రద్ధ ... మహిళలు, దళిత గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టడంపై లేకపోవడం శోచనీయం.
మంత్రులు, పార్టీ నాయకులతో తిరిగి అధికారం రాబట్టుకోవడంపై చర్చించడం కాదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి అత్యవసరంగా ఆరు నెలలకు ఒకసారి మీ అధ్యక్షతన జరగాల్సిన, ప్రతి మూడు నెలల ఒకసారి సాంఘీక సంక్షేమశాఖ, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరగాల్సిన ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టం కింద విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు జరపండి. చర్చించిన అంశాలు అమలుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వండి.
దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ చట్టం ఏ దశలో ఉందో చర్చించి, అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించడానికి తగు చర్యలు చేపట్టాలి.
ప్రభుత్వ గొప్పతనం గురించి ప్రచారం చేసుకోవడానికి ఇంటింటికి ప్రచారం మీ పార్టీ నిర్ణయం కావచ్చు, కానీ ప్రభుత్వ యంత్రాంగం తరుపున 15 రోజుల పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం పెంచడానికి ప్రచార కార్యక్రమం చేపట్టాలి.
నిన్నగాక మొన్న ఉపాధ్యాయులు ఆందోళన అణచివేయడానికి రాష్ట్రం మొత్తం పోలీసు యంత్రాంగం జల్లెడ పట్టింది. వేల మంది పోలీసులను వినియోగించారు. గతంలోనూ ప్రజా ఉద్యమాలను, ప్రతి పక్షాలను అణచి వేయడంపై పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం దృష్టి పెట్టింది.
కాని మహిళలు, దళిత, గిరిజనుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు అరికట్టడం పై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు.
పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపించడంలో ప్రభుత్వం విఫలం చెందింది.
ప్రజా ప్రతినిధులకు సేవలు, ప్రజా ఉద్యమాల అణచివేత పోలీసుల విధిగా ప్రభుత్వం మార్చేసింది.
ప్రజలకు, మహిళలకు, దళిత, గిరిజనులకు రక్షణ, శాంతిభద్రతలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
గుంటూరు, బాపట్ల, ఏలూరు, తిరుపతి తదితర జిల్లాల్లో జరిగిన హత్య, అత్యాచార, దాడుల కేసులలో నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.
ఒకవైపున ప్రజా ప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు కుటుంబ సభ్యులకు, ఆందోళన చేస్తున్న సంఘాలకు కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
మరోవైపు పోలీస్‌ అధికారులు అత్యాచార, దాడులు జరగలేదని, హత్యాచారానికి గురైన బాధితులనే తప్పు బడుతూ ప్రకటనలు చేయటం అమానుషం.
ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం బాధితులను సమాజంలో కించపరిచి, అత్యాచారం దాడులు చేసిన నేరస్తులను శిక్షించడంలో సాచివేత వైఖరి ప్రదర్శించడం శోచనీయం. పోలీసుల ప్రకటనల పట్ల ప్రభుత్వం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, మహిళలు, దళిత, గిరిజనులకు రక్షణ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. చట్టం బాధితులకు ఉందనే భరోసా కల్పించాలి.
- అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), సెల్‌ : 9490300366
000