Jul 22,2023 21:10

       మండవల్లి: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశామని డిఎస్‌పి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికను ఆమె తల్లిదండ్రులు గత సంవత్సరం నాలుగో తరగతిలో ఉండగానే స్థానిక హాస్టల్‌లో చేర్పించారని శ్రీనివాసులు తెలిపారు. బాలిక పెద్దమ్మ హాస్టల్‌ సమీపంలోనే అద్దెకు ఉండడంతో బాలిక ఆలనా పాలనా చూసుకోవాలని బాధితురాలి తల్లి కోరిందన్నారు. దీంతో బాలిక పెద్దమ్మ అప్పుడప్పుడు బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లి అవసరమైనవి కొని ఇస్తూ ఉందని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలి పెద్దమ్మ కొడుకు మైనర్‌ ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో బాలికను హాస్టల్‌ నుండి ఇంటికి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడేవాడని తెలిపారు. ఇదే క్రమంలో బాలికకు వరుసకు అన్నయ్యతో పాటు మరో మైనర్‌, అతని స్నేహితుడైన పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ కూడా బాలికను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు ఆందోళనతో ఎవరికీ చెప్పలేదని వివరించారు. ఈ నెల 18న బాలికను మళ్లీ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించిందని, ఈ క్రమంలో విషయం వెలుగుచూసిందని తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ముద్దాయిల కోసం గాలిస్తుండగా మండవల్లి రైల్వేస్టేషన్లో తిరుగుతున్న ఇద్దరు మైనర్లను, ఖాదర్‌ఖాన్‌ను అరెస్టు చేశామని చెప్పారు. వారిపై ఫాక్సో కేసులతో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
హాస్టల్‌ వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు
బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు హాస్టల్‌ వార్డెన్‌ కె.నాగలక్ష్మిని సస్పెండ్‌ చేశామని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.జయప్రకాష్‌ తెలిపారు. ఆయన శనివారం మండవల్లిలో వసతిగృహాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడి మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థులను బయటకు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా చిన్నారులను బయటి వ్యక్తులతో అసలు పంపకూడదన్నారు రెండు నెలలుగా బాలిక ఆరోగ్య పరిస్థితి బాగోనప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదని తెలిసిందన్నారు. దీనిపై వార్డెన్‌ నాగలక్ష్మిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.