Oct 14,2023 21:08

అటవీశాఖకు బదలాయించిన భూములను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు, బాధితరైతులు

గరుగుబిల్లి: రైతుల పట్టా భూములను బలవంతంగా అటవీశాఖకు బదలాయించడం సమంజసం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు విమర్శించారు. గొట్టివలస, ఉల్లిభద్ర రెవెన్యూ పరిధిలో అటవీ శాఖకు బదలాయించ తలచిన భూములను శనివారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ అనేక ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు 2008లో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని ఆ భూములపై రైతులు విలువైన టేకు, నీలగిరి మొక్కలను నాటి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. గరుగుబిల్లి మండల రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సర్వేనెంబర్‌ 272,273,274లో ఉన్న రైతులను కనీసం సంప్రదించకుండా వారి భూములను అటవీ శాఖకు బదలాయించారని ఈ చర్య చట్టపరంగా తీవ్ర తప్పిదమని తెలిపారు. అటవీశాఖకు బదలాయించిన భూమి సర్వే నెంబర్‌ 279 గా అధికారుల పేర్కొని, 272, 273, 274 సర్వే నెంబర్లలో పట్టాలు పొంది సాగులో ఉన్న రైతులను భూముల నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం గరుగుబిల్లి మండలంలో చట్టాన్ని ధిక్కరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సమయం ఇచ్చినట్లు నమ్మబలికి రైతుల, ప్రజల ప్రమేయం లేకుండా, క్రైస్తవ భక్తులు పూజలు నిర్వహించిన పూజా సామాగ్రిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దౌర్జన్యంగా ట్రెంచ్‌ నిర్మాణం చేస్తున్నారని, తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిచో రైతుల తరఫున ముందుండి సిపిఎం ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బివి రమణ, రైతు ప్రతినిధులు బొండపల్లి ప్రసాదరావు, బోను శంకరరావు, బోనెల వెంకటి తదితరులు పాల్గొన్నారు.