Jan 27,2023 23:53

మార్గాన్ని తాత్కాలికంగా మూసి వేస్తున్న బోర్డు పెట్టిన అటవీశాఖ సిబ్బంది

డిఎఫ్‌ఒ సాయిబాబా
ప్రజాశక్తి-మోతుగూడెం

చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు జలపాత అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు డిఎఫ్‌ఒ వాకపల్లి సాయిబాబా తెలిపారు. అటవీశాఖ విశ్రాంతి భవనంలో శుక్రవారం ఆయన స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ, వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో జలపాతాన్ని మొదటి దశలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం నాలుగు రోజులు పర్యాటకులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. జలపాతం వద్ద చుట్టూ పరిసరాలలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా తమ సిబ్బందితో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. మొదటిదశ పనులలో భాగంగా జలపాతానికి 50 మీటర్లు ఇవతల చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి, పర్యాటకుల వద్ద కొంత రుసుము వసూలు చేస్తామన్నారు. వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు, స్త్రీలకు దుస్తులు మార్చుకోవడానికి వెదురుతో రెండు, మూడు గదులు, పర్యాటకులు భోజనాలు చేయడానికి అనువుగా తగు ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు. జలపాతానికి వచ్చిన ఆదాయంతో వన సంరక్షణ సమితి సిబ్బందికి జీతాలు, జలపాతం అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అసాంఘిక కార్యక్రమాలు చేపడితే అటవీశాఖ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్కవరం ఇన్‌ఛార్జి ఎఫ్‌ఆర్‌ఒ కొండలరావు, డిఆర్‌ఒ సత్యనారాయణ రాజు, గార్డు వెంకట్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.