గిరిజన సంఘం కూనవరం మండల కార్యదర్శి బొర్రయ్య
ప్రజాశక్తి-విఆర్.పురం
గిరిజనులపై అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపాలని గిరిజన సంఘం కూనవరం మండల కార్యదర్శి బి.బొర్రయ్య డిమాండ్ చేశారు. కూనవరం మండల కేంద్రంలోని గిరిజన సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అటవీ చట్టాలను తుంగలో తొక్కితున్నాయన్నారు. 40 ఏళ్లగా నివసిస్తున్న జీవిస్తున్న గిరిజనులను ఇల్లు కట్టుకోవద్దని చట్ట, ఏ జిఒ ప్రకారం బెదిరిస్తున్నారో ఫారెస్ట్ అధికారులు బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయాలని డిమాండ్ చేశారు. పూర్వం నుండి 2005 డిసెంబర్ ముందు వరకు అటవీ ప్రాంతంలో సాగు భూమిలో ఉన్న వారికి పట్టాలు మంజూరు చేయాలని, ఇళ్ళు, రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని 2006 అటవీ హక్కుల చట్టం చెప్పుతున్నా, ప్రభుత్వం అధికారులు దానిని అమలు చేయడం లేదన్నారు. గిరిజనులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బెదిరించటం చూస్తుంటే బ్రిటిషు వారి పాలన గుర్తుకోస్తుందని పేర్కొన్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని, గిరిజనులు నివాసగృహాలు కట్టడానికి సహకరించాలని డిమాండ్ చేశారు. నేడు మోడీ ప్రభుత్వం అటవీ హక్కు చట్టాలను సవరిస్తుందని, దానికి వ్యతిరేకంగా గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు టి.తమ్మయ్య, పాయం సీతారామయ్య, ఎన్.రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.










