ప్రజాశక్తి-చింతూరు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతంలో అటవీశాఖ అధికారి సిహెచ్.శ్రీనివాసరావు హత్యకు వ్యతిరేకంగా శుక్రవారం అటవీశాఖ సిబ్బంది ఖాకీ యూనిఫారం ధరించి మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం నుంచి ఐటిడిఎ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 'జోహార్ శ్రీనివాసరావు', అక్రమార్కుల అడ్డగింపులో అసువులు బాసిన శ్రీనివాస్ అమర్ రహే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అడవులను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తమకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో చింతూరు అటవీ శాఖ సిబ్బందిపై కూడా అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బందిని ప్రభుత్వం బాధ్యతాయుతంగా కాపాడే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పీవో ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు, డీఎఫ్‌ఓ సాయిబాబాకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ స్థాయి అటవీ శాఖ సిబ్బంది మోహన్, విజయలక్ష్మి, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.










