Sep 03,2023 21:12

ఎపి గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం
12, 13 తేదీల్లో విశాఖలో జాతీయ సదస్సు
ప్రజాశక్తి - పోలవరం
     కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అటవీ వన సంరక్షణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఎపి గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టం రద్దు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోలవరం మండలంలోని వెంకటరెడ్డి గూడెం గ్రామంలో ఏజెన్సీ గిరిజన సంఘ కార్యాలయంలో వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు మాట్లాడుతూ పాలకులు అడవుల నుంచి ఆదివాసీలను గెంటేయడానికి అనేక కుట్రలను పన్నుతున్నారని, అందులో భాగమే 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టమని తెలిపారు. గత నెల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని పాస్‌ చేశారని, ఈ చట్టం వల్ల దేశంలోని అడవులను, కొండల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు, విదేశీ సామ్రాజ్యవాదులకు అప్పజెప్పడానికి పాలకులు పూనుకున్నారన్నారు. దీంతో లక్షలాది మంది ఆదివాసీలు నిరాశ్రయులవుతారని, జీవ వైవిద్యం నాశనమవడంతో పాటు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందన్నారు. వర్షాలు పడక పంటలు పండని దుర్భిక్ష పరిస్థితి దేశంలో ఏర్పడుతుందన్నారు.
     తక్షణమే 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం సెప్టెంబరు 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఆ సదస్సులో ఆదివాసీలు, ప్రజాతంత్ర వాదులు, మేధావులందరూ పాల్గొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్‌ బాషా, ఏజన్సీ గిరిజన సంఘం నాయకులు మిడియం పోశీరావు, మిడియం రవిదొర, కలుం వెంకటేశ్వరరావు, కొమరం రామారావు, గంగాదేవి, మడకం పోసమ్మ తదితరులు పాల్గొన్నారు.