ప్రజాశక్తి-చింతూరు
ఆదిమ కాలం నుండి అడవి బిడ్డలకు అటవీ ఉత్పత్తులే జీవనాధారం. సీజన్ వారీగా అటవీ ఫలసాయం, ఉత్పత్తులను సేకరిస్తూ ఆహారంగా ఉపయోగించుకోవడంతో పాటు వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం చింతూరు అడవులు దొరకే తునికి పళ్లును గిరిజనులు సేకరించి రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు.
చింతూరు ఏజెన్సీ బీడి ఆకు (తునికాకు) ప్రసిద్ధి. ఇక్కడి గిరిజనులకు తునికాకు రెండో ఆదాయ వనరు. బీడి తయారీకి ఉపయోగించే తునికాకును అడవిలో సేకరించి విక్రయిస్తూ ఆదాయం పొందుతారు. అంతే కాకుండా తునికి చెట్లకు కాసే పండ్లును సేకరించి విక్రయించి ద్వారా కూడా గిరిజనులకు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఆదివాసీలు ఇంటిల్లపాది వేకువ జామునే లేచి అడవిలో లభించే తునికి పండ్లును సేకరించి బుట్టలలో వేసుకొని రహదారి పక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. ఈ సీజన్లో విరివిగా లభించే తునికి పండ్లు తినడం వలన మంచి పోషక విలువలు అందడంతో పాటు అనేక రకాల రుగ్మతల నుండి కాపాడబడే అవకాశం ఉంది. అటవీ ఫల సాయంలో లభించే ప్రకృతి సిద్ధ పోషకాలు ఎంతో మేలు చేస్తాయనడంతో అతిశయోక్తి లేదు. తునికి పండ్లుతో పాటు ఉసిరికాయలు, ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే కరక్కాయలు, తాండికాయలు, ముష్టి గింజలు వంటి వాటిని కూడా గిరిజనులు సేకరిస్తారు. అడవిలో విష సర్పాలు, క్రూర మృగాలు బారినుండి తప్పించుకుంటూ ఎంతో నేర్పుతో ఈ అటవీ ఫల సాయాన్ని సేకరిస్తూ ఉంటారు.
అయితే అడవులు నరికివేతతో ఈ అటవీ ఫలసాయాలు క్రమక్రమంగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కొండ చీపుర్లు, తేనెతో పాటు ముష్టి గింజలు, నేలవేమి, గడ్డి చామంతి, పెన్నేరు గడ్డ, వాకుడు వేళ్ళు, తిప్పతీగ, నేరేడు చెక్క, వావిలాకు వంటి పలు రకాల ఔషధ మొక్కలు అంతరించిపోతున్నాయి. ఈ ఔషధ మొక్కలు ఆయుర్వేద వైద్యానికి ఎంతో దోహదం చేస్తాయి. ఆయుర్వేద ఔషధ మొక్కలు అంతరించకుండా కాపాడాల్సిన బాధ్యత, వాటిని భావితరాలకు అందించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. మంచి ఆరోగ్యానికి దోహదపడే అరుదైన పళ్ళును కాపాడుకోవాలి.










