ప్రజాశక్తి పాడేరు:ప్రధానంగా గిరిజన రైతులు ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు ఉత్పత్తి చేసే కాఫీ, పసుపు, అల్లం, మిరియాలు, జీడిపప్పు చింతపండు, రాజ్మా ఎరుపు, తెలుపు చిక్కుళ్ళు, రాగులు, సామలు, కొర్రలు, వంటి ఆహార పంటలతో పాటు అడవి నుంచి సేకరించే కొండ చీపుర్లు, తేనె, కరక్కాయలు, పాల పిండి, సీకాయ, అడ్డాకులు వంటి అటవీ ఉత్పత్తులకు ఎంతో గిరాకీ ఉంది. ప్రతి ఏడాది పాడేరు ఏజెన్సీ నుంచి ఈ అటవీ వ్యవసాయ గిరిజన ఉత్పత్తులు మైదాన ప్రాంతాల్లోని మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. వీటిని వ్యాపారులు సంతల్లో గిరిజనుల నుంచి కొనుగోలు చేసి నేరుగా మార్కెట్లకు ఎగుమతి చేస్తుంటారు. వినియోగ దారులు వీటిని సేకరించుకోవాలంటే వారపు సంతలకు వెళ్లి నేరుగా గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంతంలో వినియోగదారులకు ఈ అటవీ వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి మంచి ధరకు ఐటీడీఏ అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు పండించే స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తులను సరసమైన ధరలకు విరివిగా వెలుగు ద్వారా నిర్వహిస్తున్న వన్ దన్ కేంద్రాల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
జిల్లా కేంద్రమైన పాడేరులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో పాటు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వన్ దన్ కేంద్రం ద్వారా గిరి ఉత్పత్తుల విక్రయానికి ఐటీడీఏ శ్రీకారం చుట్టడంతో వినియోగదారులకు సౌలభ్యం ఏర్పడింది. పాడేరు ఏజెన్సీ 11 మండలాల్లో లభ్యమయ్యే గిరిజన ఉత్పత్తుల సేకరణకు వెలుగు శాఖ ద్వారా గిరిజన రైతుల భాగస్వామ్యంతో వన్ దన్ కేంద్రాలను వందకు పైగా ఏర్పాటు చేశారు. ఈ వన్‌త దన్ కేంద్రాలలో మహిళలు పురుషులు కలిపి 300 మంది చొప్పున సుమారు 30 వేల మంది గిరిజన రైతులను భాగస్వామ్యం చేసి అటవీ వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఒక్కొక్క వన్ దన్ కేంద్రానికి రెండున్నర లక్షల చొప్పున ఆర్థిక తోడ్పాటును ఐటిడిఏ అందిస్తోంది. ఈ విధంగా రిటైల్ మార్కెటింగ్‌తో గిరిజన రైతుల ఆదాయం పెంచేందుకు గిరి ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐటిడిఏ చేపట్టిన ఈ కార్యక్రమం సఫలమవుతోంది. గ్రామాల్లోని వన్ దన్ కేంద్రాల ద్వారా సహకరించే గిరిజన వ్యవసాయ అటవీ ఉత్పత్తులను పాడేరులో ఉన్న ప్రధాన వన్ దన్ కేంద్రంలో గ్రేడింగ్ చేసి ఆకర్షనీయంగా ప్యాకింగ్ చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. నాణ్యమైన రీతిలో వీటిని వినియోగదారులకు మార్కెట్లో విక్రయించగలు గుతున్నారు. ముఖ్యంగా పసుపు, రాజ్మా చిక్కుళ్ళు, కాఫీ, మిరియాలు, అడవి తేనె, పాల పిండి, అడ్డాకుల ప్లేట్లు, కొండ చీపుర్లు, జీడిపప్పు సికాయ పౌడర్, చింతపండు, రాగి పిండి, రాగులు, సామలు, కొర్రలు, వంటి చిరుధాన్యాలు అరకిలో ప్యాకెట్లలో వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. నాణ్యమైన ఈ గిరిజన ఉత్పత్తుల విక్రయంపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరు మెయిన్ రోడ్డులోనే ఏర్పాటు చేసిన ఈ వన్ దన్ కేంద్రం అందర్నీ ఆకర్షిస్తూ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఆర్గానిక్ గిరిజన ఉత్పత్తుల వినియోగంతో కాల్షియం లోపం నివారణ మధుమేహం, రక్తపోటు, నియంత్రణ వంటి ఉపయోగాలను వెలుగు అధికారులు వినియోగదారులకు వివరిస్తూ వీటి విక్రయాలను చేస్తున్నారు.










