Nov 06,2022 23:56

మహాసభలో మాట్లాడుతున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు

గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు
ప్రజాశక్తి- రంపచోడవరం
కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్ష
ణ చట్ట సవరణ ఆపాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షలు లోతా రామారావు డిమాండ్‌ చేశారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం నాయకురాలు కొమరం చెల్లయమ్మ అధ్యక్షతన గిరిజన సంఘం మండల ప్రథమ మహాసభ జరిగింది. ఇందులో పాల్గొన్న రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో గిరిజనులకు తీవ్ర నష్టం కలిగించే అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుందని తెలిపారు. చట్ట సవరణ జరిగితే బడా కార్పొరేట్‌ శక్తులైన అదాని, అంబానీలకు అటవీ సంపదను గ్రానైట్‌, లేటరేట్‌, మైనింగ్‌ను దోసిపెట్టనుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏజెన్సీలో ఉన్న బాక్సైట్‌ సంపదను తరలించేందుకు ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసిన 5వ షెడ్యూల్‌లో ఉన్న చట్టాల వలన ఏమి చేయడానికి వీలులేకుండా ఉందని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్‌లో అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లు పెట్టడం ద్వారా గిరిజనులను నట్టేట ముంచేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జీవో 3ను పునరుద్ధరణ చెయ్యాలని, పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
మండల కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో గిరిజన సంఘం మండల కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సాదల విద్యాధర్‌రెడ్డి, తీగల శ్రీనివాస్‌, మరో ఐదుగురు ఆఫీస్‌ బేరర్స్‌గా, నలుగురు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు కె.బాపన్నదొర, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.వాణీశ్రీ, జిల్లా నాయకులు కె.శాంతిరాజు, కె.రామలక్ష్మి పలువురు గిరిజనులు పాల్గొన్నారు.