Apr 17,2022 14:47

'అమ్మమ్మ యూ ట్యూబ్‌కి ఎడిక్ట్‌ అయిపోయింది నాన్నా. రాత్రిపూట దొంగగా చూస్తోంది. చెత్తాచెదారం, రూమర్స్‌ ఏవీ వదిలిపెట్టడం లేదు' నా కూతురి కంప్లైంట్‌.
నిజమే కావొచ్చు.. అత్తయ్య నిద్రలేమి కళ్ళు గుర్తొచ్చి మనసులో అనుకున్నాను.
'సర్లే.. తీరిగ్గా ఉన్నప్పుడు చూస్తే తప్పేమిటి? ప్రపంచంతో కనెక్ట్‌ కావడం, అప్డేట్‌ కావడం మంచిదేగా!'
'అలా చూస్తే ఎందుకంటాను? అదే పనిగా చూడ్డం, వద్దంటే నన్ను విసుక్కోవడం. ఫేస్బుక్‌, వాట్సప్‌ల్లో ప్రతిదీ ఫార్వార్డ్‌ చేస్తుందని, యూ ట్యూబ్‌ పరిచయం చేశాను. ఇలా తయారైంది' కూతురి కంప్లైంట్‌ విని ముచ్చటేసింది. సాధారణంగా టీనేజ్‌ పిల్లలు సోషల్‌ మీడియాకి ఎడిక్ట్‌ అయితే పెద్దలు చెయ్యాల్సిన కంప్లైంట్‌ ఇది. మా ఇంట్లో ఉల్టా, పల్టా.
'నువ్వు చెప్పు నాన్నా, నా మాటా, అమ్మ మాటా అమ్మమ్మ వినదు'.
'సరే చూద్దాం లే' అని నా ఆఫీస్‌కి బయలుదేరాను.
అత్తయ్య గురించి ఆలోచనలు ముసురుకున్నాయి.
ఇప్పుడైతే ఇలా మామూలు పెద్దావిడలా, ఆరామ్‌ సే అన్నట్టు, ఇంట్లో ఉన్నారుగానీ.. ఒకప్పుడు ఎంత చురుకుగా ఉండేవారు. చిన్నప్పటి నుండి చురుకే అంటారు. ఫీజులకు కష్టమై ఒక వంక, ఆడపిల్ల అంటూ ఒక వంక పదవ తరగతిలోనే చదువు మాన్పిస్తామని ఇంట్లో అన్నప్పుడు, తనకన్నా చిన్నపిల్లలకు ట్యూషన్‌ చెప్పి, టైలరింగ్‌ నేర్చుకొని చదువు కొనసాగించారట. అలాగే టైపింగ్‌ నేర్చుకున్నారట. ఆపై ప్రేమించి, పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. మారుమూల పట్నంలో మామయ్యతో తానూ చిరుద్యోగంలో జాయినయ్యారు.
వారిరువురుకీ రెండు వైపులా కుటుంబాల మద్దతు లేదు. దాదాపు ఒంటరి ప్రయాణం. ఒకరికి ఒకరే తోడు. ఈ లోగా ముగ్గురు పిల్లలు. అందరూ ఆడపిల్లలే. ఉద్యోగం, ఇల్లు బాధ్యతల్ని సాఫీగా నెట్టుకొచ్చారు. నిజానికి ఆమె ఒంటి చేత్తో నెట్టుకొచ్చారు అనాలి. ఎందుకంటే మామయ్యలోని ప్రేమికుడు పెళ్లి వరకే ఉన్నాడు. పెళ్లయిన మరుక్షణం ప్రేమికుడి పాత్ర ముగింపుకొచ్చి, అహంకారపు భర్త పాత్ర ఎంటర్‌ అయ్యింది. కష్టపెట్టారని అనలేం కానీ సంతోష పెట్టలేదని అనగలం. ఆయనకు తన సరదాలు తనవే. తన స్నేహాలు, తన విహారయాత్రలు తనవే. మూడో కూతురు పుట్టేముందు మూడు నెలలు ఇంట్లో లేరు. పుట్టినప్పుడు ఆ విషయం ఆయనకు ఫోన్‌ ద్వారా తెలపాల్సి వచ్చింది. ఆయన అంతదూరంలో ఉండాల్సిన ఘన కార్యమేదీ లేకున్నా. అయినా ఆవిడ ఎప్పుడూ కంప్లైంట్‌ చేసింది లేదు. పిల్లల సంరక్షణలో లోటు చేసింది లేదు. వాళ్ళ నాన్నపై చులకన భావం కలిగేలా మాట్లాడింది లేదు. పిల్లల్ని అడిగితే అమ్మకన్నా నాన్న ఇష్టం అనేవారు. వాళ్ళ పేర్లు, ఏం చదువుతున్నారో తడుముకోకుండా ఆయన చెప్పగలరా అన్నది డౌటే. రోజూ వెంటపడి, జడలేసి, తినిపించి, లాలించినా, అప్పుడప్పుడు కసురుకొనే అమ్మ కన్నా, అన్నీ చూసుకునే అమ్మకన్నా, వారంలో కొన్నిరోజులు మాయమైనా, వస్తూనే గిఫ్టులు తెచ్చే నాన్న, ఉన్నంత సేపూ ముద్దు చేసే నాన్న అంటే ఇష్టమే కదా! వాళ్ళు పెరిగి, డిగ్రీలు, పెళ్లిళ్లు పూర్తయ్యాక, మామయ్యకు జబ్బు చేసింది. ఆయన ఐసీయూలో ఉన్న వారం రోజులూ అత్తయ్య ఆయన బెడ్‌ పక్కనే రేయింబవళ్లు కూర్చున్నారు. రాత్రంతా నిద్రమాని కూర్చున్నా, తెల్లారేసరికి ప్రశాంతంగా, ఫ్రెష్‌గానే ఉండేవారు. విసుగు, విరామం మచ్చుకైనా కనబడేవికావు.
'మేం చూసుకొంటాం కదా, మీరు ఇంట్లో ఉండొచ్చు కదా' అన్నా వినేవారు కాదు.
'ఇదేం కష్టంలే బాబూ' అనేవారు.
నిజమే. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు పక్కన లేని భర్త వల్ల కలిగిన కష్టం కన్నా ఇదెక్కువ కాదు కదా! ఆయన కోలుకున్నాక అత్తయ్య జాబ్‌ విడిచిపెట్టారు. మూడేళ్లకు మామయ్య కన్నుమూశారు. ఆ మూడేళ్లు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మూడుసార్లు ఆయనకు గుండెపోటు వచ్చినా కోలుకోగలిగారంటేనే ఆ కష్టం అర్థం చేసుకోవచ్చు.
ఆయన మరణాన్ని మౌనంగా భరించారు. ఆ విషాద సమయంలోనూ సంయమనం కోల్పోయినట్టు, బేజారెత్తిపోయినట్టు కనబడలేదు. పైసాపైసా తన పెన్షన్‌ డబ్బే ఖర్చుపెట్టారు. కానీ కూతుళ్ళని సాయం చెయ్యనివ్వలేదు.
మా ఆవిడ తనకు పెద్ద కూతురు. ఎంతో బలవంతం మీద మా దగ్గర ఉండడానికి ఒప్పుకున్నారు. రానురాను రొటీన్‌ జీవితానికి అలవాటయ్యారు. ఇక పిల్లలతో, పూజలతో, పుస్తకాలతోనే కాలక్షేపమే.
రెండో కూతురికి లంకంత ఇల్లు. భర్త, పిల్లలే ఇంట్లో ఉండేది. అయినా ఆవిడని అప్పుడప్పుడైనా, మొహమాటానికైనా తల్లిని రమ్మని పిలవదు. ఒకవేళ పిలిస్తే నిజంగానే వచ్చేస్తుందని భయం కాబోలు. ఫోన్లో మాత్రం తనివి తీరని ముచ్చట్లు.
మూడో కూతురు డిటో. తన సంసారం, తన ప్రపంచం. ఈ మధ్య మా ఏరియాలో కరోనా కేసులు అధికమయ్యాయి. రెండో కూతురు మా ఫోన్‌కి దొరకదు. దొరికినా ఏం చెప్పబోతుందో తెలుసు. అందుకనే మూడో కూతురితో ఒకసారి మాట్లాడాను 'చుట్టూ కరోనా కేసులొస్తున్నాయి. అత్తయ్య పెద్దవారు కదా. మీ ఇల్లు గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంది కాబట్టి, ఇక్కడకన్నా రిస్కు తక్కువ. కొన్నాళ్ళు ఉంచుతారా?' అని.
ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. 'లేదు బావగారూ! చిన్నక్క అమ్మని ఇంతవరకూ ఇంట్లో ఉంచింది లేదు. వాళ్ళు మొదట ఉంచితే తర్వాత మేం ఉంచుతాం'.
నేనూ, మా ఆవిడ ఆశ్చర్యపోలేదు. కానీ ఈ విషయం అత్తయ్యకు తెలియనివ్వకూడదని అనుకున్నాం. బాధ పడతారని. ఉన్నంతలో జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే కొన్నిరోజుల తర్వాత అత్తయ్య వాళ్ళింటికి వెళ్లినా రెండ్రోజుల కన్నా ఎక్కువ ఉండలేకపోయారు. అది వేరే విషయం.
మాకూ, పిల్లలకూ అత్తయ్య మాతో ఉండడమే ఎక్కువ ఇష్టమై పోయింది. తల్లీ కూతుళ్ళు అరుచుకుంటారు..కలిసిపోతారు. ఎవరైనా పనిచెయ్యక తిట్లు తింటారు. కానీ అత్తయ్య ఎక్కువ పనిచేసి, తిట్లు తింటారు. ఎలాంటివంటే ఎక్కువ వండడం, ఇంట్లో ఎవరిపనైనా తానే ముందు చెయ్యడానికి ఉరకడం లాంటివి. తిట్టినా మారరు. ఆవిడ ఫోన్లో గంటల తరబడి మాట్లాడ్డం మా ఆవిడకు నచ్చదు.
'చూడండి. మా చెల్లెళ్ళ స్పందనకి తగ్గట్టుగా అమ్మ ఉండాలి కదా! మైమరచి ఫోన్లో గంటల తరబడి మాట్లాడేస్తుంటుంది' అంటుంది.
'తనతో మాట్లాడే వాళ్ళతో ప్రియంగా మాట్లాడ్డం ఆవిడ అలవాటు. మంచిదేగా. అయినా నీతో ఉన్నంత చనువుగా, నీ ఇంట్లో ఉన్నంత ఇష్టంగా అక్కడ ఆవిడ ఉండలేరుగా?' నా జవాబు.
'వద్దన్నా వంటగదిలో దూరుతుంది. నా పని నన్ను చేసుకోనివ్వదు. ఎక్కువెక్కువ వండేస్తుంది'.
'నష్టమేముంది? వృధా చెయ్యం కదా! ఎవరో ఒకరి కడుపు నిండుతుందిలే!' కొట్టిపడేస్తాను.
ఇదే డౌటు ఒకసారి అత్తయ్యని అడిగాను. ఒకరికి అవసరమైన చోట ముగ్గురికి సరిపోయినట్లు ఎందుకు వండుతారని. 'అలవాటై పోయింది బాబూ, మీ మామయ్య భోజనం టైముకి చెప్పాపెట్టకుండా ఎవరినో తీసుకొచ్చేవారు. సరిపెట్టడానికి కష్టమై పోయేది. రానురాను ఒక గరిటె ఎక్కువ వండడం అలవాటైంది. అయినా ప్రయత్నిస్తాను లెండి' అంటారుగానీ మళ్లీ మామూలే.
తల్లీ కూతుళ్ళు, అమ్మమ్మా మనవరాళ్లు కీచులాడుకొంటారు. కలిసి నవ్వుకొంటారు. అన్నీ ఏరోజుకారోజే. ఒకరు ఒకరోజు కనబడకపోతే, మిగిలిన వాళ్ళు వెలితి ఫీల్‌ అవుతుంటారు.
మరిప్పుడు ఇలా ఎందుకయ్యింది? ఆవిడ ఇంతకుముందులా చలాకీగా ఉండడం లేదు. నిర్లిప్తత కనబడుతోంది. ముభావంగా ఉంటున్నారు కూడా. ఆలోచించాను.. అర్థమైంది.
ఊహించినట్టుగానే సాయంత్రం ఇంటికి చేరగానే నా కూతురు మళ్లీ ప్రశ్నించింది. అమ్మమ్మకు చెప్పావా అని.
'అమ్మమ్మకు కాదుగానీ నీకు చెప్తున్నాను. యూ ట్యూబ్‌ గురించి మాట్లాడకు. ఇంటర్నెట్‌ కట్‌ చెయ్యకు. రోజూ ఒక గంట అమ్మమ్మతో మామూలు కబుర్లు చెప్పు. ఎప్పటిలాగే నీ కాలేజీ విషయాలు చెప్పు చాలు. మళ్లీ వారం తర్వాత మనం మాట్లాడదాం'.
వారం గడిచింది. నాకు మార్పు తెలుస్తోంది.
'నాన్నా, అమ్మమ్మ ఇప్పుడు పాత అమ్మమ్మలాగే ఉంది. ఏ ఎడిక్షన్‌ లేదు. ఇంత మార్పు ఎలా వచ్చింది?'
'యూ ట్యూబో, మరొకటో పరిమితికి మించి చూస్తున్నారంటే అది వాటి గొప్పతనం కాదు. చూసేవాళ్ళ మానసిక ఒంటరితనం. ఈ మధ్య నువ్వు చదువులో పడి అమ్మమ్మతో మాట్లాడ్డం తగ్గించావు. అమ్మ కూడా జాబ్‌లో పడి, తనకిచ్చే టైము తగ్గింది. మీరే తనకి మానసికంగా దగ్గర. మీరు కూడా దూరమయ్యారన్న బాధ. మనుషుల మధ్య దూరం పెరిగితే, ఆ స్పేస్‌ సామాజిక మాధ్యమాలు, వ్యసనాలు తీసుకుంటాయి. మళ్లీ మీ మధ్య గ్యాప్‌ తగ్గింది. ప్రాబ్లెమ్‌ సాల్వ్‌ అయ్యింది'.
'మరి అదేదో పుస్తకాలు చదవడం వ్యసనంగా మారొచ్చు కదా!'
'పుస్తకాల వ్యసనం ఆరోగ్యమే. కానీ దానికి ఆసక్తి, వాటిపై ఫోకస్‌ అవసరం. దగ్గరివారు సరిగ్గా లేరన్న బాధ ఒకటి మనసులో ఉంటే అది సాధ్యం కాదు.
సామాజిక మాధ్యమాలకి ఆ పెట్టుబడి అవసరం లేదు. గుడ్లప్పగిస్తే చాలు. అందుకనే సులభంగా అలవడతాయి. లోపలి బాధ అలాగే ఉంటుంది'.
'అర్థమైంది నాన్నా, ఐ లవ్యూ'.
'ఓకే బంగారం. ఇంట్లో మనుష్యుల మధ్య ఉండాల్సింది సరైన కమ్యూనికేషన్‌. అప్పుడు సౌకర్యాలతో పని ఉండదు. డేటా అవసరం అనిపించదు'.
అటు వైపు నుండి తల్లీకూతుళ్ళ వాదన హై డెసిబెల్స్‌లో వినిపిస్తోంది. ఈ మధ్యన లేనిదిది. నేనూ, మా అమ్మాయీ అనుకున్నాం.. మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాయని.. మంచిమార్పుకి సంకేతం.

డా. డివిజి శంకరరావు
94408 36931