Oct 14,2023 22:46

ప్రజాశక్తి- పుంగనూరు: భర్త, అత్త, మామలు వేధిస్తున్నారని పుంగనూరు పోలీస్‌ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది, దీనిపై స్పందించకపోగా పోలీసుల ఎదుట మహిళపై భర్తతో కలిసి వారు దాడి చేశారు. ఈ విషయంపై పోలీసులు స్పందించకపోవడంతో ఆమె జాతీయ రహదారిపై తన బిడ్డతో సహా శనివారం నిరసనకు దిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మైనార్టీ మహిళ ఎస్‌.షాన్వాద్‌ తనకు పెళ్లి అయినప్పటి నుంచి భర్త, అత్త, మామ, భర్త సోదరి, ఆమె భర్త అందరూ కలిసి వేధిస్తున్నారని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తనకు న్యాయం చేయకపోగా వారి ముందే అందరూ కలిసి తనపై, బిడ్డపై దాడి చేస్తున్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించింది. తనకు న్యాయం కావాలని పోలీసు స్టేషన్‌కు వెళ్లితే పోలీసులు న్యాయం చేయకుండా తనపై వారి కుటుంబ సభ్యులు దాడి చేసిన భర్త కుటుంబ సభ్యులకు అండగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్‌ స్టేషన్లో తనకు న్యాయం జరగదని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురై తన రెండేళ్ల బిడ్డతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపింది. ఇప్పటికైనా పోలీస్‌ అధికారులు స్పందించి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది.