ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వ్యవసాయంలో వినూత్న పద్ధతులతో ఫలితాలు సాధించిన పల్నాడు జిల్లా అమరావతిలోని అత్తలూరు ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును కంపెనీ అధ్యక్షులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అయిన ఎల్.శివశంకర్ గురువారం అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు సేంద్రీయ ఎరువుల వినియోగంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించిన రైతులను 'రైతుకు వందనం' పేరుతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టెర్ కార్యాలయంలో సత్కరించి ప్రశంసా పత్రాలు ఇస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు.
అమరావతి మండలం అత్తలూరు ఆర్గానిక్ ఫామ్‌కు ఆర్థిక సహాయం అందించటంతో ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ముందంజలో నిలిచింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్తలూరు ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. అత్తలూరు పాలెం ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్స్‌కు 2023 సంవత్సరంలో ప్రకతి వ్యవసాయ మార్కెట్ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి జైవిక్ ఇండియా జాతీయ అవార్డుకు ఎంపికైంది. గ్రామంలోని 450 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం విధానాలు పాటిస్తూ వరి, మిరప, కూరగాయలు పంటలను పండిస్తూ వారి వద్ద ఉన్న సేంద్రియ ఆహార ఉత్పత్తులను నేరుగా అత్తలూరు ఆర్గానిక్ కంపెనీ వారే కొనుగోలు చేసి మార్కెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయోప్యాచ్ ఇండియా నేచురల్ ఎక్స్‌ప్రో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమానికి అత్తలూరు రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షులైన జిల్లా కలెక్టర్ శివశంకర్ జాతీయ అవార్డును గురువారం ఢిల్లీలో ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ,రైతు సాధికార సంస్థ చైర్మన్ విజరుకుమార్ పాల్గొన్నారు.










