Jul 25,2022 23:08

. సెల్లార్‌లో కుమారునితో కూర్చుని పోరాటం చేస్తున్న లీలా మాధురి

ప్రజాశక్తి - ఆరిలోవ        పాత డెయిరీఫారం ఆదర్శనగర్‌లో అత్తింటి ముందు పదేళ్ళ కుమారుడితో కలిసి కోడలు న్యాయ పోరాటం చేస్తోంది. దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలివి. శ్రీకాకుళం జిల్లా తోటపాలెం ప్రాంతానికి చెందిన విశ్రాంతి ఎక్సైజ్‌ సిఐ మల్లపురెడ్డి సింహాచలం కుమార్తె లీలా మాధురిని ఆదర్శనగర్‌ ప్రాంతానికి చెందిన ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీరామమూర్తి కుమారుడు జయదీప్‌కు ఇచ్చి 2012లో వివాహం చేసారు. రెండేళ్ళు గడిచిన తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వీరికి పదేళ్ల కొడుకు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు పెరగడంతో 2016లో లీలామాధురి తన కొడుకుతో కన్నవారింటికి వెళ్లిపోయింది. దీనిపై. అప్పట్లో విడాకులు కావాలని భర్త జరుదీప్‌ కోర్టుకు వెళ్ళారు. విడాకులు వ్యవహారం తేలేవరకు అత్తారింట్లోనే లీలామాధురి ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును అనుసరించి ఈ నెల 16న లీలామాధురి కొడుకుతో కలిసి అత్తారింటికి వచ్చింది. అప్పటి నుంచి అత్తారింట్లోనే ఉన్న లీలామాధురి ఆదివారం కొడుకుతో కలిసి బీచ్‌కు వెళ్లి, తిరిగొచ్చేసరికి అత్త, మామ, భర్త ఇంటికి తాళాలు వేసుకొని ఎటో వెళ్లిపోయారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆదివారం రాత్రంతా సెల్లార్‌లోనే వారు గడిపారు. విషయం తెలుసుకున్న లీలా మాధురి తండ్రి సింహాచలం దీనిపై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.