Nov 21,2023 00:08

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారంతో ముగింపు సమావేశం ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. ముగింపు సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ నైనారు మధుబాల అధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయ వారోత్సవాలలో వివిధ రకాలైన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారని, ఇదేవిధంగా ప్రతిరోజూ గ్రంథాలయంకు రావడం దినచర్యగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యఅతిధిగా నగరపాలక మేయర్‌ అముద పాల్గొని మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం కాబట్టి ప్రతి విద్యార్థి చక్కగా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుండి తాను గ్రంథాలయంకు వెళ్లి వివిధ రకాలైన పుస్తకాలు చదవడం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నాని తెలిపారు. పిసిఆర్‌ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ షేక్‌ అబ్దుల్‌ మజీద్‌ మాట్లాడుతూ పుస్తక పఠనం, అభ్యాసం వలన విజ్ఞానంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. వివిద రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయంలో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి శర్మ, ఇన్‌ఛార్జ్‌ డిప్యూటీ లైబ్రేరియన్‌ లలిత, మధుబాబు, రాజ్‌కుమార్‌ గుణశేఖర్‌, బిలాల్‌ గ్రంథాలయ అధికారులు పూర్ణిమ, తులసి కుమార్‌, దేవీబాల, సరస్వతి, శిరీష, లవకుమార్‌, రాజశేఖర్‌, ఎల్లమ్మ పాల్గొన్నారు.