ప్రజాశక్తి- కౌతాళం : వివాహం నెల రోజుల్లోనే పచ్చని కాపురంలో కలకలం ఏర్పడింది. సజావుగా సాగాల్సిన సంసారంలో భార్య భర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కాపురం తమ తమ ఊరిలో ఉండాలని భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ ఇద్దరి హత్యకు దారితీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపురం గ్రామంలో వెలుగు చూసింది. ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...బాపురం గ్రామానికి చెందిన బోయ తలారి హనుమంతమ్మ (45)బాపురం తలారిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఒక కూతురు మహాదేవి వయస్సు( 25,) బాపురం గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఐదేళ్లక్రితం ఈర్ల దిన్నె గ్రామానికి చెందిన దస్తగిరితో వివాహం అయింది. వ్యక్తి గత కారణాలతో విడిపోయారు. మహాదేవి రెండవ వివాహం కర్ణాటక రాష్ట్ర తెక్కలకోటకు చెందిన బోయ రమేష్‌తో గత నెల రోజుల క్రితం హచ్చోలి మఠంలో పెద్దలు సమక్షంలో వివాహం చేశారు. పెళ్లి అయ్యాక తెక్కల కోటలో కాపురం ఉండాలని రమేష్, మహాదేవి గ్రామ వాలంటీర్ అయినందున బాపురంలోనే కాపురం ఉండాలనే విషయంలో ఈ నెల 9న రాత్రి గొడవ పడ్డారు. బంధువులు సర్దిచెప్పారు. శనివారం రాత్రి రమేషన్ అత్తహనుమంతమ్మతో, భార్య మహాదేవితో గొడవ పడి ఇద్దరిని బలమైన ఆయుధంతో తలపై మోది హత్య చేశాడు. ఈ విషయం ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి బయట తాళం వేసి పారిపోయాడు. ఆదివారం ఉదయం హనుమంతమ్మ అన్న అయ్యప్ప బంధువులు ఫోన్ చేస్తే సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వారు అనుమానంతో హనుమంతమ్మ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటం గమనించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఇంటి కిటికీలోంచి చూశారు. ఇరువురు నేల మీద పడి ఉండటం చూసి తాళం పగలగొట్టి చూశారు. హనుమంతమ్మ , మహాదేవి తలలకు తీవ్ర రక్త గాయాలతో చనిపోయినట్లు గుర్తించారు. ముద్దాయి రమేష్ మీద హనుమంతమ్మ అన్న అయ్యప్ప సంసారం ఎక్కడ పెట్టుకోవాలనే అనుమానంతో గొడవ జరిగిందని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముద్దాయిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని కౌతాళం ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు.










