Sep 07,2023 23:00

మాట్లాడుతున్న అదనపు డిజిపి సంజరు

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారా నిరోధక చట్టం కింద వస్తున్న బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర సిఐడి అదనపు డిజిపి ఎన్‌.సంజరు తెలిపారు. గుంటూరు బ్రాడిపేటలోని ఓ హోటల్‌లో గురువారం ఎస్‌సి, ఎస్‌టి కేసులపై సిఐడి విభాగం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే రీతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కేసులపై పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు త్వరతిగతిన పరిష్కరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ కేసులపై పోలీసు అధికారులు నిశిత పరిశీలన చేసి సత్వరన్యాయం జరిగేలా చూడాలన్నారు. కోర్టులో కూడా విచారణ వీలైనంత త్వరగా ముగించాలన్నారు. ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ఎస్‌టిలపై పెరుగుతున్న దాడులపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్ధసారధి మాట్లాడుతూ వీలైనంత వరకు కేసులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా నాల్గో అదనపు కోర్టు, ఎస్‌సి, ఎస్‌టి కేసులు విచారణ న్యాయమూర్తి శరత్‌బాబు, సిఐడి ఐజి శ్రీకాంత్‌, ఎస్‌పిలు ఆరీఫ్‌ హఫీజ్‌, సరిత, ఫకీరయ్య, పలువురు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, వైద్యులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.