Jul 28,2023 20:37

అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి

రాయచోటి : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై (ఎస్సీ, ఎస్టీ పిసిఆర్‌, పిఒఎ, యాక్ట్‌) జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటి సమావేశాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌, రెవెన్యూ, సాంఘీక సంక్షేమం, ప్రాసిక్యూషన్‌ ప్రధాన విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదైన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధికారుల దష్టికి తీసుకురావాలని డివిఎంసి కమిటీ సభ్యులను సూచించారు. అన్యాయం జరిగిన వారి పక్కన జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. 01-04-2023 తేదీ నుంచి 30-06-2023 తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి17 కేసుల్లో 09 కేసులకు సంబంధించి రూ.6.87 లక్షలు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఛార్జ్‌సీట్‌ ఎఫ్‌ఐఆర్‌ స్టేజిలో 6 కేసులకు సంబంధించి రూ.6 లక్షలు మంజూరైందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీసులతోపాటు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కేసులలో ఎప్పటి కప్పుడు ఛార్జిషీట్‌ దాఖలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలోగా కేసులను పూర్తిచేయాలని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం సకాలంలో అందేలా చూడాలన్నారు. అనంతరం డివిఎంసి సభ్యులు లలితమ్మ పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడానికి, పిల్లల బాల్యాన్ని రక్షించడానికి మాతో చేరండి వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌, ఎస్పీ, జెసిల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమావేశంలో ఎస్పీ గంగాధర్‌రావు, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్‌డిఒలు రంగస్వామి, మురళిలు, రామకృష్ణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, సాధికారికత జిల్లా అధికారి జాకీర్‌ హుస్సేన్‌, డీఎస్పీలు, ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎస్‌పి గంగాధర్‌రావు, ఇతర అధికారులు