Mar 29,2023 00:50
బాపట్ల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కేసులలో విచారణ వేగవంతం చెయ్యాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిల్లాలో డీఎస్పీలతో ఎస్సీ/ఎస్టీ కేసులపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం నమోదయిన కేసుల వివరాలు, వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు ఫైల్స్‌ను పరిశీలించి సదరు కేసులలో దర్యాప్తు, నిందితుల అరెస్ట్‌, ఛార్జిషీటు దాఖలు తదితర విషయాలలో తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులు అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టాలని, కేసుల విచారణ సమయంలో బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నిర్దేశిత కాల వ్యవధిలో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసి, సమర్థవంతమైన ట్రయిల్‌ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, దర్యాప్తులో అలసత్వం వహించరాదని, అలసత్వం వహించిన పోలీస్‌ అధికారులపై శాఖాపర మైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో బాపట్ల డిఎస్‌పి ఏ శ్రీనివాసరావు, ఎస్సీ/ఎస్టీ సెల్‌ డిఎస్‌పి ఎవి రమణ, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ పి బాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.