ప్రజాశక్తి-కాకినాడ ఎస్‌సి, ఎస్‌టిలపై దాడుల్లో బాధిత కుటుంబాలకు సత్వరం సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు హాజరైన ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి డివి.రమణమూర్తి గత సమావేశంలో చర్చించిన అంశాలపై కార్యాచరణను వివరించారు. అనంతరం జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం పంపిణీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు సత్వరం న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కృషి చేస్తున్నట్టు తెలిపారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి ఛార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రస్తుతం 19 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నాయన్నారు. కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విచారణను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఛార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నట్లు వివరించారు. దశల వారీగా బాధిత కుటుంబాలకు అందాల్సిన పరిహారం విషయంలో సమన్వయ శాఖల అధికారులతో కలిసి కషిచేస్తున్నట్లు ఎస్‌పి సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, బండి వీరలింగేశ్వరరావు, గంగవంశం త్రినాథ్‌దేవ్, పిల్లి జ్యోతి పాల్గొన్నారు.










