
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారం, సత్వర న్యాయం, బాధితులకు పరిహారం అందించడంలో పోలీసు అధికారులు ప్రో యాక్టివ్ గా స్పందించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్ అమలకు సంబంధించి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో స్పందన మీటింగ్ హాల్లో నిర్వహించి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసుల పెండింగ్, బాధితులకు పరిహారం అందించే అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నివారణ సంబంధించి జిల్లాలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, మానభంగాలు ఎక్కువగా నమోదవుతున్న పోలీస్ సబ్ డివిజన్లలో హాట్ స్పాట్లు గుర్తించి, ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని, వాటి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు 102 కేసులకు సంబంధించి 115 మంది ఎస్సీ ఎస్టీ బాధితులకు పరిహారం రు.1.01 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పి పి జాషువా మాట్లాడుతూ దిశ చట్టం అమలు పోలీస్ అధికారులు జిల్లాలో పాఠశాలలు బాలికల హాస్టళ్లులో విస్తతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎర్లీ ఏజ్ లో ప్రేమ వ్యవహారాలపై కౌన్సిలింగ్, అవగాహన నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో సిటిజన్ చార్టర్ తో పాటు ఎస్సీ ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) యాక్ట్, ఏసీబీ చట్టం నిబంధనలతో బోర్డులు ప్రదర్శించాలని, సామాన్య ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని ఎస్పి పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. సమ సమాజ స్థాపన జరగాలని ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారంతోపాటు బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు కషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి శ్రీ హరి బాబు, కమిటీ కన్వీనర్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి షాహిద్ బాబు షేక్, జిల్లాలో పోలీస్ సబ్ డివిజనల్, దిశా అధికారులు పాల్గొన్నారు.