ప్రజాశక్తి కాకినాడ
కాకినాడ జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా, పరిహారం అందేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ఎంపి వంగా గీత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వివేకానందహాల్‌లో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ( ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీస్) సమావేశంలో ఎంపి గీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్, డిఆర్‌ఒ కె.శ్రీధర్‌రెడ్డి, అడిషనల్ ఎస్‌పి పి.శ్రీనివాస్, సమన్వయ శాఖల అధికారులు హాజరయ్యారు. గత డిసెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలపై కార్యాచరణను సాంఘిక సంక్షేమ శాఖ జెడి జె.రంగలక్ష్మీదేవి వివరించారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కాకినాడ జిల్లా తొలి కలెక్టర్ కృతికా శుక్లా సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. కాకినాడలో రూ.100 కోట్లతో చేపట్టిన ఇఎస్‌ఐ ఆసుపత్రి పనులు 80 శాతం మేర పూర్తయ్యాయని త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కషిచేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ కృతిక మాట్లాడుతూ ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన అసైన్‌మెంట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 1,396 మంది ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులకు త్వరలోనే 1,500 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నట్టు, రూ.3.60 కోట్లతో ఏడు సంక్షేమ హాస్టళ్లకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, కత్తిపూడి బాలుర హాస్టల్, శంఖవరం బాలుర హాస్టల్, తుని బాలికల హాస్టల్ కొత్త భవనాలకు రూ.60 లక్షల చొప్పున జిల్లా ఖనిజ ఫౌండేషన్ నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎస్‌ఆర్ కింద రూ.60 లక్షలతో జగన్నా యక్‌పూర్ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. బాలాజీచెరువు సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర హాస్టల్ పనులకు రూ.కోటి ఎంపి, ఎంఎల్‌ఎల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల్లో 2020 నుంచి ఇప్పటి వరకు బాధితులకు దాదాపు రూ.3.17 కోట్ల మేర పరిహారం అందించామన్నారు. ఇటీవల శృంగవృక్షం ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి సహాయాన్ని అందించామన్నారు. గ్రామాల్లో పీస్ కమిటీల సమావేశాలు నిర్వహించి అట్రాసిటీస్ చట్టంపై అవగాహన కల్పించనున్నట్టు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కాకినాడ ఎస్‌పీ ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2013 నుంచి ఇప్పటి వరకు చూస్తే ప్రస్తుతం 39 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ)లో ఉన్నాయని వివరించారు. కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శృంగవక్షం ఘటనలో 11 మందిని అరెస్టు చేశామని ప్రస్తుతం ఈ కేసును సీబీ-సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
సమావేశంలో జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, డాక్టర్ మోకా పవన్ కుమార్, బండి వీరలింగేశ్వ రరావు, గంగవంశం త్రినాథ్‌దేవ్, పిల్లి జ్యోతి హాజరయ్యారు. యుద్ధప్రాతి పదికన కేసుల విచారణ, వివిధ కేసుల్లో పురోగతి, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, పందుల పెంపకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకా శాలు, అన్నమ్మ ఘాటీ చెరువు పనులు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ అంశాలపై చర్చించారు. సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సమావేశంలో పెద్దాపురం ఆర్‌డిఒ కాకినాడ ఇన్‌ఛార్జ్ ఆర్‌డిఒ జె.సీతారామా రావు, ఎస్‌సి, ఎస్‌టి సెల్ డిఎస్‌పి అప్పారావు, డీఎల్‌డిఒలు పి.నారాయణ మూర్తి, కెఎస్‌ఎన్‌వీ ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి ఎన్.విజరు కుమార్, హౌసింగ్, ఐసిడిఎస్, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు బి.సుధాకర్ పట్నాయక్, కె.ప్రవీణ, కె.శ్రీరమణి, బి.ప్రియవద, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి, సిపిఒ పి.త్రినాథ్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఆర్.రమేష్ హాజరయ్యారు.
సమావేశంలో పాల్గొన్న ఎంపి గీత, కలెక్టర్ కృతికా శుక్లా ఎస్‌పి సతీష్ కుమార్, డిఆర్‌ఒ శ్రీధర్‌రెడ్డి










