ప్రజాశక్తి - క్రోసూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 41 సీఆర్పీసీ ప్రకారం స్టేషన్ బెయిలు ఇవ్వటాన్ని ఆపాలని ఆమంచి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన దళిత, గిరిజన, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దళిత రక్షణ యాత్ర సందర్భంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మనువాద బిజెపి అధికారంలోకి వచ్చాక సమాజంలో మనువాద భావజాలాన్ని ప్రోత్స హిస్తున్నారని అన్నారు. దళితులు, గిరిజనుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగా యని ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైన సందర్భంలో నిందితులకు బెయిల్ ఇస్తే అది బాధితులకు ప్రమాదమని చెపాపరు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఆపాలని కోరారు. ప్రతి దళితవాడకు శ్మశాన స్థలాన్ని ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు గృహ వినియోగ విద్యుత్ బకాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కెవిపిఎస్ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, వివిద సంఘాల నాయకులు టి.హనుమంతరావు, యోహాన్ పాల్గొన్నారు.










