Aug 03,2023 00:24

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వటాన్ని వెంటనే ఆపాలని దళిత, ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దళితుల మీద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత రక్షణ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ నాగమల్లేశ్వరరావు, కె.రోశయ్యల అధ్యక్షత వహించారు. పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనువాద భావజాలాన్ని పెంచిపోషిస్తోందని, ఇది దళితులపై దాడులు పెరగడానికి దారితీస్తోందని ఆన్నారు. అట్రాసిటీ చట్టం కోరలు పీకడానికి మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని, అయితే తీవ్ర పోరాటాల కారణంగా వెనక్కి తగ్గిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన సవరణలు ప్రమాదకరమైనవని, వీటిని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు, హత్యలు, భూములను గుంజుకోవటం, కబ్జా చేయటం తీవ్రమయ్యాయని విమర్శించారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులను అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా దళితుల చేతిలో ఉన్నటువంటి భూములను నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకోవడం పరిపాటైందని, దీనివల్ల భూమిలేని దళితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో చేపట్టే దళిత రక్షణ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వివిధ సంఘౄల నాయకులు ప్రసాద్‌, జి.జాన్‌పాల్‌, ఎన్‌.చిట్టిబాబు, కె.చంద్రశేఖర్‌, కరిముల్లా, టి.పెద్దిరాజు, జి.రవిబాబు, ఎ.లక్ష్మిశ్వరరెడ్డి, జె.భగత్‌, ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు.