ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే 41వ సిఆర్‌పిసి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఈ అంశంపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పండరిపురంలోని ఏలూరి సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కెవిపిఎస్ మండల అధ్యక్షులు ఎస్.బాబు అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భూములను ధనికులు, భూస్వాములు ఆక్రమించు కుంటున్నారని, దాడులు, అత్యాచారాలూ పెరిగిన నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వివక్ష, ఇతర సమస్యలపై ఎస్సీ, ఎస్టీలు ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ పెట్టాలన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విల్సన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల సాగుభూమి, మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని లేదా ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. శ్మశానాల్లో పనిచేస్తున్న వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించి నిరుద్యోగులకు శిక్షణివ్వాలని కోరారు. విసికె పార్టీ నాయకులు వంజయ్య ముత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యావిధానం దళితులను విద్యకు దూరం చేస్తుందని చెప్పారు. మూసేసిన పాఠశాలలను పున:ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అన్ని ఎస్సీ, ఎస్టీల కాలనీలకు శ్మశాన స్థలాలు కేటాయించాలని, ఆయా కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.మోహన్ మాట్లాడుతూ స్థానిక ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట క్రిస్టియన్ శ్మశానవాటికతోపాటు పట్టణంలోని చాలాచోట్ల శ్మశానాలు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై పోరాడాల్సి ఉందని చెప్పారు. దళితులపై దాడులకు పాల్పడ్డం ద్వారా వారిని వికలాంగులను చేసిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు నష్టపరిహారంగా ఇచ్చేలా చట్టం రూపొందించాలన్నారు. సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, పనిచేసే సంఘాలకు కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో దళితుల నుండి ప్రభుత్వం తీసుకున్న భూములను వెంటనే తిరిగివ్వాలని కోరారు. బిజెపి మతోన్మాద శక్తులు మునువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అన్ని అంశాలపై సాగే పోరాటాల్లో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ఇదిలా ఉండగా వచ్చేనెలలో కెవిపిఎస్ నిర్వహించే దళిత, గిరిజన రక్షణ యాత్రకు అన్ని సంఘాల నాయకులూ మద్దతు తెలిపారు. సమావేశంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి బి.లక్ష్మణ్, ఎఎన్‌పిఎస్ నాయకులు డి.రాజు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.










