
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం, మూఢ నమ్మకాలు, అట్రాసిటీలపై చర్చకు కమిటీ సమావేశం ఒక మంచి వేదిక అని అన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్భందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సామాజిక బహిష్కరణలు విధిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌పి పి.జగదీష్ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీస్ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో రాజమహంద్రవరం డివిజన్ పరిధిలో సెంట్రల్ జోన్‌లో 14, తూర్పు జోన్‌లో 10, సౌత్ జోన్‌లో 8, నార్త జోన్‌లో 28, కొవ్వూరు డివిజన్ జోన్‌లో 19 మొత్తంగా 79 కేసులు వివిధ దశలలలో విచారణలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్, జెసి తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.