Mar 07,2021 16:33

దారిన వెళుతున్నపుడు పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకుని జేబులో పెట్టుకొనేవారే ఎక్కువ. అలాంటిది 50 కాసుల బంగారం అంటే.. అక్షరాలా రూ. 20 లక్షల విలువ చేసేవి దొరికితే ఏంచేస్తారు? వెనకా ముందు ఆలోచించకుండా వాటిని తీసుకుని, మాకు దొరకలేదని చెప్పేవారే ఎక్కువ. కానీ కళ్ల ముందు అంత సొమ్ము కనిపిస్తున్నా నిజాయితీగా తిరిగిచ్చాడు ఓ ఆటోడ్రైవర్‌. అతని నిజాయితీ వల్ల ఓ నవ వధువు కాపురమెలా నిలబడిందో చదవండి.

చెన్నై నగరంలోని క్రోంపేటకు చెందిన వ్యాపారవేత్త పాల్‌బ్రైట్‌ తన కుమార్తెకు చర్చిలో ఘనంగా వివాహం చేశారు. కుమార్తె వివాహానికి 50 కాసుల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. వివాహానంతరం బంధుమిత్రులను, నవ దంపతులను ఇంటికి పంపించారు. కొద్ది సమయం తర్వాత కుమార్తెకు కానుకగా ఇచ్చిన బంగారాన్నంతా ఒక బ్యాగ్‌లో సర్దుకుని, ఆటోలో ఆయన ఇంటికి బయలుదేరారు. కూతురి పెళ్లి ఘనంగా చేశానని సంతోషంతో ఇంట్లోకి వెళ్లిన ఆయన చేతిలో బంగారం ఉంచిన బ్యాగు లేదు. అది ఏమైందోననే ఆందోళనతో ఆయనకు ఒక్కసారి గుండె జారినట్లైంది. బ్యాగు ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తుంటే.. బ్యాగు ఆటోలో మరచిపోయినట్లు కొద్దిసేపటిలోనే గుర్తుకొచ్చింది. కానీ ఆటో నెంబర్‌గానీ, డ్రైవర్‌ పేరుగానీ పాల్‌బ్రైట్‌కు తెలియదు. 'అయ్యో! ఇప్పుడెలా? మరికొద్ది సేపటిలో కూతురిని అత్తారింటికి పంపించాలి. ఆమె అత్తింటివారికి ఈ విషయం ఎలా చెప్పాలి?' అని కుటుంబసభ్యులంతా మదనపడ్డారు. చివరకు చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే క్రోంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

అసలేం జరిగిందంటే..
చర్చి దగ్గర ఆటోలో ఎక్కిన పాల్‌బ్రైట్‌ ఇల్లు చేరే వరకూ ఫోన్‌ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆటో దిగి, డబ్బులిచ్చి ఇంట్లోకి వెళ్లిపోయాడు. కానీ అతని పక్కనే ఉన్న బ్యాగు మరిచిపోయాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటోడ్రైవర్‌ శరవణకుమార్‌ ఆ బ్యాగును గుర్తించాడు. వెంటనే దానిని తెరచి చూశాడు. అందులో ఎంతో విలువైన బంగారం కనిపించింది. కచ్చితంగా అవి ఇంతకు ముందు ఆటో ఎక్కిన ఆయనిదే అయి ఉంటుందని గుర్తించాడు. ఆయన కోసం మళ్లీ వెనక్కి వెళ్లాడు. కానీ ఆయన దిగిన ఇంటి చిరునామా కనుక్కోలేకపోయాడు. చేసేదేమీ లేక చివరకు ఆ నగల బ్యాగుతో పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు.


అదే సమయానికి పోలీసులు పాల్‌బ్రైట్‌ ఇల్లు చేరిన దారిలో సీసీటివి ఫొటోల ఆధారంగా ఆటోను గుర్తించారు. అది శరవణకుమార్‌ సోదరి పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె ఇంటి అడ్రసు కనుక్కొని వెళ్లాలి అనుకుంటున్నారు. అప్పుడే శరవణ్‌ పోలీసుస్టేషన్‌కు బ్యాగుతో సహా రావడంతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. 'ఎంత నిజాయితీ, ఈ రోజుల్లోనూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారా?' అంటూ అక్కడి పోలీసు అధికారి శరవణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. పాల్‌బ్రైట్‌ తన కూతురి కాపురాన్ని నిలబెట్టావంటూ ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి శరవణ్‌ ఆటో ఎక్కిన కస్టమర్ల దగ్గర నుంచి ఛార్జీకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోరట! ఈ రోజుల్లోనూ ఇంత నిజాయితీగా ఉండే వ్యక్తులు ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. హ్యాట్సాప్‌ శరవణ్‌!