ప్రజాశక్తి - పల్నాడు జిల్లా, వినుకొండ : నరసరావుపేటకు సమీపంలోని కేసానుపల్లి వద్ద గుర్తించిన 18.9 ఎకరాల్లో ఆటో నగర్ ఏర్పాటుకు సమగ్ర నివేదికను పదిరోజుల్లో రూపొందించాలని, శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆదేశించారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మొపుతామని చెప్పారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు వినుకొండ, నరసరావుపేటలో బుధవారం నిర్వహించగా మంత్రి పాల్గొన్నారు. నరసరావుపేట సమీక్షలో మాట్లాడుతూ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ కోసం రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో గుర్తించిన ఎన్‌ఎస్‌పి కెనాల్ భూమి సరిపోదని, ఏడెకరాలను గుర్తించాలని చెప్పారు. కత్వా చెరువు నిర్మాణానికి రూ.19 కోట్లు మంజూరు చేసిందని, పనులను ప్రారంభించాలని అన్నారు. మైనారిటీ సక్షేమ హాస్టల్‌లో సిబ్బందిని భర్తీ చేయాలని, మైనారిటీ కాంప్లెక్స్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన రూ.70 లక్షలు మంజూరుకు అనుమతిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. 525 టిడ్కో ఇళ్లకు విద్యుత్ సరఫరా, మోటార్లు సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఉప్పలపాడు లే అవుట్‌లో 4300 గృహాలు మంజూరైన నేపథ్యంలో ఆప్షన్-3 కింద లబ్ధిదార్లు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలపై పెండింగ్ కేసులు, ఇతర డేలా మొత్తం అందించాలని చెప్పారు. విప్పర్లపల్లి మైనింగ్ లేవలింగ్ పనులు పూర్తి చేయాలని, విప్పర్లపల్లి, లింగంగుంట్ల ప్రాంతంలో భూముల రీ-సర్వేను ఏడ్రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయాలు, రైతు భరోసా భవనాల నిర్మాణం వేగం పెంచాలన్నారు. వినుకొండ నియోజకవర్గ సమీక్ష అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తూనికలు కొలతల శాఖ ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించి పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేస్తామన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో 100 గింజలకు ఒక గింజ ఫోర్టిఫైడ్ గింజ కలుపుతారని చెప్పారు. ఇదిలా ఉండగా జిల్లాలో పెదకూరపాడు, సత్తెనపల్లి, వినుకొండ, నరసరావుపేట నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయని, మిగతా వాటినీ త్వరలో సమీక్షిస్తామని చెప్పారు. సమీక్షల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి, బి.బ్రహ్మనాయుడు, కలెక్టర్ ఎల్.శివశంకర్, జెసి శ్యామ్‌ప్రసాద్, ఎస్సీ వై.రవిశంకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










