
ఆటో కార్మికులపై వేధింపులు సరికాదు : సిపిఎం
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్
ఆటో కార్మికులను వివిధ రకాల చలానాలతో విధింపులకు గురిచేయడం సరికాదని సిపిఎం ఆధ్వర్యంలో ఆటో కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఎన్‌వి రమణకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం బ్యాంకు, ఫైనాన్స్ ద్వారా అప్పి, ఆల్ఫా, ఆటోలు తెచ్చుకుని జీవనం సాగిస్తున్న వారిపై ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాసు, విద్యుత్ చార్జీలు పెరిగాయని, వీటికి తోడు ఇన్సూరెన్స్, పొల్యూషన్, పాసింగ్ చలానా తదితర ఖర్చులతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులపై వేధింపులు మానుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి టి గోపాల కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పీపకీర్ సాహెబ్, సిఐటియు రూరల్ కార్యదర్శి నాగన్న, అప్పి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు జి వెంకట్ రెడ్డి, ఈశ్వరన్న, ఆశన్న, జమాల్, పీరయ్య ,తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు.