May 25,2023 23:54

మాట్లాడుతున్న ఆటో యూనియన్‌ నాయకులు కె.సత్యనారాయణ

ప్రజాశక్తి - ఆరిలోవ : గడచిన మూడు నెలలుగా ఆటో కార్మికులపై రవాణాశాఖ అధికారులు దాడులు విస్తృతం చేసి, భారీ జరిమానాలను విధిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని ఆరిలోవ జోన్‌ ఆటో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆరిలోవ సిఐటియు కార్యాలయంలో ఆరిలోవ జోన్‌ ఆటో కార్మికుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఎంవిఐలకు టార్గెట్లు విధించి ఆటోలపై దాడులు చేయిస్తూ, భారీగా జరిమానాలను విధించి ఖజానా నింపుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. వాహనమిత్ర పేరుతో ఏడాదికి రూ.పదివేలు ఇచ్చి, అంతకు ఐదారు రెట్లుకు మించి అదే ఆటోడ్రైవర్ల నుంచి అపరాధ రుసుముగా వసూలు చేస్తున్నారన్నారు. ఆటోకార్మికులపై ప్రభుత్వ ప్రోద్బలంతో రవాణాశాఖ చేస్తున్న దాడులను వెంటనే ఆపకపోతే ఆర్‌టిఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆరిలోవ ఆటో స్టాండ్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సత్తిబాబు, సూరిబాబు, రమణ, రాజు పాల్గొన్నారు.