Jul 19,2023 00:18

సిఐటియు ఆధ్వర్యాన కొమ్మాది కూడలిలో నిరసన తెలుపుతున్న ఆటో కార్మికులు

ప్రజాశక్తి -మధురవాడ : ఆటో కార్మికులపై ఆంక్షలు, విపరీతమైన జరిమానాలు విధించడం ఆపాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) నగర అధ్యక్షులు పి.రాజుకుమార్‌ డిమాండ్‌చేశారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొమ్మాది కూడలిలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజుకుమార్‌ మాట్లాడుతూ, ఆటోలను ట్రాఫిక్‌లో నిలిపినప్పుడు, పాసింజర్లను దించినప్పుడు రాంగ్‌ పార్కింగ్‌ అంటూ పోలీసులు ఫొటోలు తీసి ఈ చలానాలు పంపడం అన్యాయమన్నారు. ట్రాఫిక్‌ సమస్య ఉందని జాతీయ రహదారిపైకి ఆటోలను మళ్లిస్తుండటంతో ప్రయాణికులను వారి ప్రాంతాలలో దించడం కష్టమవుతుందన్నారు. ప్రయాణికులు సేవా రహదారిలో ఉంటారని, ఆటోలను జాతీయ రహదారిపై పంపడం వల్ల బేరాలు లేకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆటోల పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించాలని, ఈ చలానాలు రద్దుచేయాలని, వాహన మిత్ర పథకం డ్రైవర్లు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.అప్పలరాజు, బి.నాగేశ్వరరావు, జి.చిన్నారావు, టి.రమేష్‌బాబు, డి.రవి, ఎర్రయ్య, ఎం.రాము, ప్రసాద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.