Nov 09,2022 23:14

సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేస్తున్న ఆటో డ్రైవర్లు

ప్రజాశక్తి- పిఎం పాలెం: ఆటో రిక్షా డ్రైవర్లుపై అర్‌టిఒ అధికారులు జులం ప్రదర్శిస్తున్నారని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం, సిఐటియు నగర అధ్యక్షులు పి.రాజ్‌కుమార్‌ అన్నారు. ఆటో డ్రైవర్లపై దౌర్జన్యం, బెదిరింపులు వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో మధురవాడ జోనల్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ, నగరంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర విఐపిలు వస్తే ఆటోడ్రైవర్లు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు. బుధవారం ఆర్‌టిఒ అధికారులు, సిబ్బంది వచ్చి మధురవాడలోని అన్ని ఆటో స్టాండ్‌ల ఆటోలను ఈనెల 12న ప్రధాని మోడీ సభకు తరలించాని ఆదేశించారన్నారు. గతంలోనూ ముఖ్యమంత్రి కార్యక్రమాలకు రెండుసార్లు బలవంతంఆ ఆటోలు పెట్టించారన్నారు. రోజంతా తిప్పించి, ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఇపుడు ఆటోలు పెట్టకుంటే, 13న వచ్చి ఒక్కొక్కరికీ రూ.20వేలు వరకు జరిమానాలు విధిస్తామని బెదరించి వెళ్లారన్నారు. ఆర్‌టిఒల జులుం, బెదిరింపులు ఆపకపోతే, రవాణాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జి చిన్నారావు, డి రవి, ఆటో యూనియన్‌ జోన్‌ కార్యదర్శి టి రమేష్‌ బాబు, కె. వీరు బాబు, కె.సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.