ప్రజాశక్తి - కుక్కునూరు
ఆటో డ్రైవర్లకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి జినగం గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య భవనంలోని ప్రజా సంఘాలు కార్యాలయంలో కుక్కునూరు ఆటో డ్రైవర్లు యూనియన్ సమావేశం వేల్పుల దుర్గయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఆటో డ్రైవర్ల కష్టాలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రవాణారంగంపై అనేక రూపాలలో పన్ను విధిస్తూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయన్నారు. కానీ పన్ను కడుతున్న ఆటో కార్మికులను చలనాల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. కుక్కునూరులో ఆటో కార్మికులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం లేకపోవడం వలన ప్రయాణికులు, ఆటోలు ఎక్కడం లేదని, అసలే రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుపోతుంటే కనీసం కూలి డబ్బులు అయిన ఇంటికీ వెళ్లే పరిస్థితి లేక కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వ అధికారులు స్పందించి ఆటోలకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని, ఆటోలు కొనుక్కోవడానికి సబ్సిడీ ఇవ్వాలని లేదంటే సమస్యలు పరిష్కారం కోసం రవాణా రంగం కార్మికులను ఐక్యం చేసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి యర్నం సాయికిరణ్, వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై.నాగేంద్రరావు, ఆటో కార్మికులు శనగ రాము, సత్తి సంపత్, రాము, రాజు, మహేష్, కృష్ణ పాల్గొన్నారు.










