Feb 13,2022 10:53

అదో మత్స్యకారుల గ్రామం. ఆ ఊరిలో విద్యుత్‌ పేరు వినడమేగానీ, ఎప్పుడూ వెలుగును చూసింది లేదు. దశాబ్దాలుగా చీకట్లోనే బతుకుతున్నారు. భవిష్యత్తులోనైనా వెలుగును చూస్తామనే ఆశ వారికి లేదు. అసాధ్యం అనుకున్న పనిని కేవలం ఏడాది కాలంలోనే సుసాధ్యం చేశాడు ఆ ఊరి యువకుడు. నేడు ఆ గ్రామంలో 15 ఇళ్లల్లో సౌర విద్యుత్‌ పలకలను ఏర్పాటు చేసి, అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. అతనే తమిళనాడు తూటుకుడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మత్స్యకారుడు ఎమ్‌ శక్తివేల్‌. అసలు ఇదంతా అతనికి ఎలా సాధ్యమైందీ.. వివరాల్లోకి వెళితే..

 

అతను.. ఓ విద్యుత్‌ 'శక్తి' !



'నా 12వ తరగతి పరీక్ష పూర్తయ్యే వరకూ మా గ్రామంలో విద్యుత్‌ కనెక్షన్‌ లేదు. నా విద్యార్థి జీవితమంతా కిరోసిన్‌ బుడ్డి ముందే సాగింది. చిన్నప్పటి నుంచి పాఠాల్లో విద్యుత్‌ గురించి వినడమే గానీ, ఎప్పుడూ లైట్‌ వెలుగు చూసింది లేదు. రాబోవు తరాలకైనా విద్యుత్‌ను అందించాలని అనుకున్నా. కానీ ఆ కోరిక ఇంత త్వరగా తీరుతుందని అనుకోలేదు' అంటున్నాడు శక్తివేల్‌.
  శక్తివేల్‌ ఒక మత్స్యకార కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి వేటకు వెళ్లేవాడు. చేపలను ఎలా వేటాడాలి అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య. 'పెద్దయ్యాక చాలా కష్టాలు చవిచూశాం. మాకు మూడుపూటలా తిండి పెట్టడమూ అమ్మావాళ్లకి కష్టమయ్యేది. ఖాళీ కడుపుతో నిద్రపోయిన రాత్రులెన్నో మా జీవితంలో ఉన్నాయి. అమ్మ తాను పస్తులుంటూ మాకు గంజి కాచిపెట్టిన రోజులు మరచిపోలేదు. నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌ గురించి తెలుసుకున్నా. ''తూత్తుకుడి మీనవన్‌'' అనే ఛానెల్‌ను ప్రారంభించా. అందులో చేపలను ఎలా వేటాడతాం? అనే విషయాన్ని స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేసి, పెట్టాను. అది చాలామందికి నచ్చింది. ఆ ఒక్క వీడియోకే ఎక్కువమంది సబ్‌స్క్రైబర్స్‌ వచ్చారు. రానురాను స్మార్ట్‌ఫోన్‌ను ఒక కవర్‌లో చుట్టి సముద్రం లోపల ప్రదేశాలను వీడియోలు తీయడం మొదలెట్టాను. ఇంకా మేము వేటకు వెళ్లినప్పుడు రకరకాల చేపలు మా వలలో చిక్కుకునేవి. వాటి గురించి వివరంగా చెప్పి, అప్‌లోడ్‌ చేసేవాడిని. కానీ మాకు నెట్‌ సమస్య ఎక్కువగా ఉండేది. ఒక్క వీడియో అప్‌లోడ్‌ చేయడానికి చాలా సమయం పట్టేది. శ్రీలంక, మలేషియా, సింగపూర్‌లో నా వీడియోలకు వీక్షకులు ఉన్నారు. నేడు ఏడు లక్షలకు పైగానే సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉన్నా. కాబట్టి నా ఛానెల్‌ ద్వారా మా మత్స్యకారులకు సహాయం చేయాలి అనుకున్నా. మా ఇంటి పరిసరాలను, మా సమస్యలను వీడియో తీసి పెట్టడం మొదలుపెట్టా. వీటిని వీక్షించిన కొందరు విదేశీయులు మాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వారు నా అకౌంట్‌కి కొంత డబ్బు పంపడం ప్రారంభించారు. ముందు రెండు ఇళ్లకు రూ. 36 వేల నుంచి 60 వేల వరకు ఖర్చుపెట్టి, విద్యుత్‌ పలకలను ఏర్పాటు చేశాను. తర్వాత తక్కువ బడ్జెట్‌తో అంటే కేవలం రూ. 16 వేలతోనే మూడు లైట్లు, ఒక ఫ్యాన్‌, సెల్‌ఫోన్‌, టార్చ్‌లైట్‌కు ఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉండేలా ఏడాది కాలంలోనే 15 ఇళ్లకు సోలార్‌ పలకలను అమర్చాను' అంటున్నాడు శక్తివేల్‌.
   'సముద్ర సమీపంలో నివసిస్తున్నందున, ఒకప్పుడు రాత్రిపూట మత్స్యకారుల ఇళ్లల్లోకి చిన్నచిన్న కీటకాలు వస్తుండేవి. ప్రస్తుతం విద్యుత్‌ వెలుగులో ఇంటిని శుభ్రంగా, పురుగులు లేకుండా ఉంచుకుంటున్నారు. సోలార్‌ పలకలు అమర్చక ముందు ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకోవాలంటే దగ్గరలోని టీ దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ టీ తాగితేనే ఛార్జింగ్‌ పెట్టుకోనిచ్చేవారు. నేడు అలాంటి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు లైట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. త్వరలో మిగతా సమస్యలనూ కొద్దికొద్దిగా తీర్చుకుంటాం' అంటున్నాడు శక్తివేల్‌.