- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
- సిక్కోలు ఎక్స్‌లెన్స్ అవార్డుల పంపిణీ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఆత్మవిశ్వాసమే విజయానికి నాంది కాగలదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని పాతబస్టాండ్ వద్ద దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన సిక్కోలు ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్‌తో పాటు నీట్ ఇతర పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంచారని కొనియాడారు. ప్రస్తుతం ప్రభుత్వ బడులు ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఇదే తరహా కృషి కొనసాగితే రానున్న కాలంలో విద్యలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ దానేటి శ్రీధర్ మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని, మారుమూల పల్లెలకు విస్తరింపజేయాలని ఆకాంక్షించారు. ఎస్‌పి జి.ఆర్ రాధిక మాట్లాడుతూ యువత చెడు స్నేహాలు, అలవాట్లతో క్రిమినల్ కేసుల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు.
మంచి మార్గాలను అన్వేషించి ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. అనంతరం నిర్వహించిన జయహో కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు బ్రదర్ షఫీ విద్యార్థుల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత దానేటి శ్రీధర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.










