
అర్ధరాత్రి 12 గంటల సమయం. అందమైన ఆ స్త్రీ ఓ విటుని సంతృప్తిపరిచి, ఒంటరిగా వీధిలో నడుచుకుంటూ వస్తుంది. ఇలా ఒంటరి ప్రయాణం తనకు అలవాటే. రకరకాల మనస్థత్వాలు కలిగిన కస్టమర్స్‌కు పడక సుఖం అందించడం తన వృత్తి ధర్మం. అందుకోసం అర్ధరాత్రులు సైతం రిస్క్ తీసుకోక తప్పదు.
రైలు పట్టాలు దాటుతున్న ఆమెకు చీకట్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకొని ఉండటాన్ని గమనించింది. వెంటనే వెళ్లి ఆ యువతిని కాపాడి, తన ఇంటికి తీసుకువెళ్లింది.
***
ఉదయం తొమ్మిది వరకూ ఆదమరచి నిద్రపోతున్న ఆ యువతి ఒక మగవాని స్వరం వినిపించి, ఉలిక్కిపడి లేచింది.
వాకిలికి ఎదురుగా రాత్రి తనను కాపాడిన స్త్రీ ఓ వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది.
వాళ్ల మాటలు వినడానికి చాలా అసహ్యంగా ఉన్నాయి. వారు ఒకరిని ఒకరు పరాచకాలాడుకుంటూ నవ్వుకుంటున్న తీరును బట్టి.. తాను మంచి వాతావరణంలో లేనని ఆ యువతి నిర్ధారించుకుంది. తాను ఆపదలో ఉన్నట్లు గ్రహించింది.
యువతి నిద్ర లేచినట్లు గ్రహించిన స్త్రీ ఆ వ్యక్తికి సైగ చేస్తూ 'ఉష్.. మెల్లిగా మాట్లాడు.. ఆ అమ్మాయి లేచినట్టుంది.. మన మాటలు వింటే భయపడుతుంది' అంది.
దానికి అతడు 'సరే అలాగే. నేను చెప్పింది ఆలోచించు..' అన్నాడు యువతిని చూస్తూ.
'సరే ఆలోచిద్దాం.. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు..' ఆ వ్యక్తిని గుమ్మంలో నుంచి బయటకు నెట్టి, తలుపు వేస్తూ అంది ఆ మహిళ.
***
మిట్ట మధ్యాహ్నం ఓ అంబాసిడర్ కారు వచ్చి, ఆ ఇంటి ముందు ఆగింది.
అందులో నుండి ఓ ధృడకాయుడు గబగబా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. వెళ్లినంత వేగంగానే యువతిని భుజాలు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకుని వచ్చి, కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి డోర్ వేశాడు.
ఇంతలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన స్త్రీ అతనితో 'జేమ్స్! ఆ అమ్మాయి మత్తులో ఉంది. మెలుకువ వచ్చేసరికి సాయంత్రం కావచ్చు.. జాగ్రత్త.. చేరగానే ఫోన్ చెరు' అంటూ జాగ్రత్త చెప్పింది.
'ఓకే.. నువ్వేం భయపడకు' హామీ ఇస్తూ అన్నాడు యువకుడు.
***
ఐదు సంవత్సరాల తరువాత..
అది ఐ.జి ఆఫీసు.
ఆ అభినందన సభకు పోలీసు అధికారులందరూ హాజరయ్యారు.
'ఈ అభినందన సభకు హాజరైన పోలీసు అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేరస్తుల పాలిట సింహస్వప్నం.. అబలల ఆరాధ్య దేవతైన డిఎస్‌పి హర్షనందిని గారికి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. హర్షనందిని గారిని వేదికపైకి రావల్సిందిగా కోరుతున్నాం!' ఆహ్వానం పలికాడు ఓ పోలీసు ఉన్నతాధికారి.
పోలీసు అధికారుల హర్షధ్వానాల మధ్య డిఎస్‌పి హర్షనందినికి గొప్ప సన్మానం జరిగింది. అందరూ హర్ష నందినిని పొగడ్తలతో ముంచెత్తారు.
సన్మాన గ్రహీత మాట్లాడే సమయం వచ్చింది. అందరూ ఉత్కంఠగా ఆమె ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు.
హర్షనందిని తన కంచు కంఠాన్ని సవరించుకుంటూ 'నన్ను సన్మానించిన ముఖ్యమంత్రి గారికి, పోలీసు అధికారులకు నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను నా జీవితగాథను మీకు చెప్పాలని ఆశ పడుతున్నాను.
నేనొక పేద రైతు కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా నాన్నగారు నన్ను డిగ్రీ వరకూ చదివించి, నన్ను రమేష్ అనే ప్రైవేటు ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు.
పెళ్లి అయిన మూడు నెలలకు మొక్కుబడి తీర్చుకొనేందుకు శ్రీశైలం వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢకొీట్టడంతో అమ్మానాన్న, మా శ్రీవారు స్పాట్‌లో చనిపోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయి, పుట్టెడు దుఃఖంతో ఉన్న నేను పుట్టింటిలో ఉండటానికి అమ్మానాన్న లేరు. అత్త గారింటికి వెళ్లి ఉండాలన్నా వీలు లేదు. ఎందుకంటే మావారికి నా అన్న వారెవరూ లేరు.
అటువంటి పరిస్థితుల్లో ఒంటరి మహిళగా జీవితాన్ని కొనసాగించడం ఎంత కష్టమో గుర్తించాను. భర్త లేని స్త్రీ అంటే అందరికీ చులకనే.. అందరు మగవాళ్లూ అవకాశం కోసం చూసేవాళ్లే. కామంతో వాళ్లు చూసే చూపులకు బాధతో చచ్చిపోవాలనిపించేది.
మా పెద్దమ్మ కూతురు పద్మక్క నా స్థితికి జాలిపడి 'నందినీ నువ్వు ఈ కష్టాలన్నీ మర్చిపోయి, మామూలు మనిషివి కావాలంటే కొన్నాళ్లు పట్నంలో మా దగ్గరకు వచ్చి ఉండు!'' అంది.
బయట మగవాళ్ల బారి నుండి తప్పించుకోవాలంటే అదే మంచిదని భావించి, పద్మక్క ఇంట్లో ఉంటూ అక్కకు ఇంటిపనుల్లో సాయపడ్తూ ఉండేదాన్ని. మొదట్లో బావ కూడా బాగా చూసుకునేవాడు. కానీ రాను రాను.. అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. కావాలనే ఒంటిని తాకే ప్రయత్నం చేస్తుండటం.. ద్వంద్వ అర్థాలతో మాట్లాడటం చేసేవాడు. ఒకరోజు అనుకోకుండా అక్క ఊరెళ్లింది. ఆ రోజు రాత్రి బావ నా దగ్గరకి వచ్చి, తన కోరిక తీర్చమని అడిగాడు. అంగీకరించమని నన్ను బలత్కారం చేయబోగా, తప్పించుకుని రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లా.
ఆ రాత్రి నేను ఎంతోసేపు ఆలోచించాను. ఒంటరి మహిళకు ఈ సమాజంలో రక్షణ లేదా? ఎక్కడకు వెళ్లినా ఈ మగాళ్ల వేటకు బలైపోక తప్పదా? నాకు మాత్రం ఇంకెవరున్నారు..? నేను బతికి ఏం సాధించాలి? అందుకే చనిపోవాలని నిర్ణయించుకుని, రైలు పట్టాలపై పడుకున్నాను.
కానీ నా అదృష్టవశాత్తు ఓ సెక్స్ వర్కర్ నన్ను కాపాడి, నాకు పునర్జన్మ ఇచ్చింది. ఆమే స్వరూప అక్క.
తాను ప్రమాదకర పరిస్థితిలో ఉండి కూడా నా జీవితాన్ని కాపాడింది.
మొదట నేను ఆమెపై అనుమానపడ్డాను. ఆమె ఉన్న వాతావరణం, అక్కడికి వచ్చే వ్యక్తుల ప్రవర్తన నా అనుమానానికి కారణమయ్యింది.
నన్ను పడుపు వృత్తిలోకి దించి, సంపాదించాలని చూస్తుందేమోనని ఆమెను నిందించాను. స్వరూప అక్క దగ్గర నన్ను చూసిన కొందరు మగవాళ్లు ఆమెకు డబ్బు ఆశ చూపారు. బ్రోతల్ హౌస్‌కి అమ్మేసి, మీ కుటుంబాన్ని పేదరికం నుంచి కాపాడుకోమని సలహా ఇచ్చారు.
కానీ ఆమె తనలా మరొకరి జీవితం బలి కారాదని, వారి ప్రలోభాలకు లొంగలేదు.
ఆ రోజు నాకు ఆమె మత్తుమందిచ్చి, డ్రైవర్ జేమ్స్‌తో కారులో పంపింది. అతడు నన్నొక కౌన్సెలింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ఒక మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎందుకు నేను బతకాలో చెప్పారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు నా జీవితాన్నే మార్చేశాయి.
''ఆకాశ రాజుగా పిలవబడే గద్ద ఓ ప్రత్యేకత గల పక్షి. అది ఎత్తైన పర్వత శిఖరాలపై నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. చూపులోనూ, వేగంలోనూ దానికి ఏ పక్షీ సాటిరాదు. అది సుదూర ప్రాంతం నుంచే తన లక్ష్యాన్ని నిర్ణయించుకుని, చూపు మరల్చకుండా శరవేగంగా లక్ష్యాన్ని అందుకుంటుంది. వేటలో దాని నేర్పరితనం అమోఘం.
అంతేకాదు అన్ని పక్షులూ వర్షం నుండి తప్పించుకునేందుకు చెట్టూ పుట్టా వెతుక్కుంటూ వెళ్తుంటే.. గద్ద మాత్రం వర్షం నుంచి తప్పించుకోవడానికి ఉన్నత ఆకాశంలో మేఘాలకు పైభాగంలో ఎగురుతుంది.
అయితే ఇంత గొప్ప పక్షికీ ఒక గడ్డుకాలం ఉంటుంది. అదేమిటంటే దాని ఆయువుకాలం 70 సంవత్సరాలైతే, అది 30 ఏళ్ల వయస్సులోకి రాగానే.. దాని ముక్కు, గోళ్లు బలహీన పడిపోతాయి. అలా బలహీనపడిన గోళ్లు, ముక్కును వదిలించుకోవడానికి ఎత్తైన పర్వత శిఖరం మీదకు చేరి, తన ముక్కును, గోళ్లను ఊడిపోయేవరకూ బండకేసి రాస్తుంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు ఆహారం లేకుండా నరకయాతన అనుభవిస్తుంది. ఒక రకంగా ఇది దానికి పునర్జన్మ అనే చెప్పాలి. ఊడిపోయిన వాటి స్థానంలో కొత్తగా వచ్చిన గోళ్లు, ముక్కు గట్టి పడగానే దానికి మరలా వేటాడే శక్తి వస్తుంది. మునుపటి కంటే రెట్టించిన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని, వేట తిరిగి ప్రారంభిస్తుంది. అంటే తాను మిగిలిన జీవితాన్ని కొనసాగించటానికి తనను తాను పునర్‌నిర్మించుకుంటుంది.'
మానసిక వైద్యులు చెప్పిన ఈ కథ నన్ను ఆలోచింపజేసింది. గద్ద మాత్రమే కాదు.. మనిషైనా సరే తన భావిజీవితాన్ని కొనసాగించాలంటే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తనను తాను పునర్‌నిర్మించుకోవాలి.
అందుకే నేను ఆ రోజు స్వరూప అక్క డ్రైవర్‌తో ఇచ్చి పంపిన డబ్బుతో హైదరాబాద్‌లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్1 కోచింగ్‌కి వెళ్లి, ప్రథమ ప్రయత్నంలోనే డిఎస్‌పిగా సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో వేధించిన ఆకతాయిలే ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నారు.
స్వరూప అక్కలాంటి వారికి ఆ వృత్తి నుండి విముక్తి కలిగించేందుకు నేడు నేను కృషి చేస్తున్నాను.
నేను జీవితంలో ఓ సత్యాన్ని గ్రహించాను. స్త్రీ తనను తాను బలహీనురాలిగా ఊహించుకున్నంతకాలం పురుషులు దౌర్జన్యం చేస్తూనే ఉంటారు. అందుకే 'ఓ స్త్రీ ..! ఈ సమాజంలో నువ్వు బతకాలంటే నిన్ను నువ్వు పునర్‌నిర్మించుకో.. శక్తివంతంగా..!' అందరికీ ధన్యవాదాలు.' అంటూ తన ప్రసంగాన్ని ముగించింది.
ఆమె ప్రసంగానికి స్పందనగా సభ చప్పట్లతో మార్మోగింది.
జి. భానువర్ధన్
81065 86997