ఆత్మకూరు అభివృద్ధికి ప్రణాళికలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ఈ ఎడిఎఫ్ ద్వారా బయట ప్రాంతాల్లో ఉన్న మన నియోజకవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తల సహయ సహకారాలు తీసుకుని ప్రతి గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కరటంపాడు సచివాలయం పరిధిలోని కరటంపాడు, సాతానుపల్లి, శ్రీనివాసపురం గ్రామాల్లో ఆయన ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేదల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ అందచేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయనకు సమస్యలు విన్నవించడంతో వెంటనే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సదరన్ సర్టిఫికెట్లు అవసరమని కొందరు తెలపడంతో వెంటనే ఆ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి వెంటనే వారికి సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, దాని ద్వారా వారికి పించన్లు అందుతాయన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఆత్మకూరు నియోజకవర్గానికి రూ.1000 కోట్ల వరకు సంక్షేమ, అభివృద్ధి నిధులను మంజూరు చేశారని, కరటంపాడు సచివాలయానికి రూ.15 కోట్ల వరకు అభివృద్ధి, సంక్షేమ నిధులు అందచేశారని, ఇలాంటి ముఖ్యమంత్రిని అందరూ దీవించాలని కోరారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంజిఆర్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని, అంతేకాక ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరం ద్వారా పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులందరిని ఒక తాటిపైకి తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి సారించినట్లు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంతో సంబంధం ఉన్న ఓ ప్రజాప్రతినిధి ఎడిఎఫ్‌కు రూ.కోటి నిధులు అందచేశారని, అలాగే పలువురు పారిశ్రామికవేత్తలు తమ గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. డిజిటల్ క్లాస్ రూంలు, లైబ్రరీలు ఏర్పాటుతో పాటు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నిర్మించిన ఎంజిఆర్ మున్సిపల్ బస్టాండ్ సముదాయం ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో నిర్మిస్తున్న ఈ బస్టాండ్ ప్రారంభోత్సవానికి భారీస్థాయిలో తరలి వచ్చి ఆశీర్వాదం, మద్దతు అందచేయడం ఆనందంగా ఉందన్నారు. సుమారు 20 వేల మంది ప్రజలు హాజరైనట్లు వివరించారు. భవిష్యత్తులో ఆత్మకూరు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న సురక్ష పథకం సర్వే ప్రస్తుతం జరుగుతుందని, ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి, రూరల్ మండల కన్వీనర్ జితేంద్ర నాగ్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు జెసిఎస్ కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర, ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్, ఎస్‌ఐ శివశంకరరావు తదితరులు ఉన్నారు.










