May 26,2023 23:09

కౌలు రైతు కుటుంబంతో మాట్లాడుతున్న నాయకులు రాజశేఖర్‌, రాజుబాబు

శ్రీఎపి కౌలు రైతు సంఘం డిమాండ్‌
ప్రజాశక్తి - తాళ్లరేవు
అప్పుల బాధతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రాజశేఖర్‌, వళ్లు రాజబాబు డిమాండ్‌ చేశారు. తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో చనిపోయిన బొడ్డు గంగాధర రావు కుటుంబం ను శుక్రవారం వారు పరామర్శించారు. ఈ సంద ర్భంగా కౌలు రైతు భార్య వరలక్ష్మి, కుమార్తెలు బిజిత, మౌనిక కౌలు రైతు సంఘం నాయకులు వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. కౌలు రైతు భార్య వరలక్ష్మి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి వరుస నష్టాలు రావడం వల్ల అప్పులు పెరిగిపోయాయని పెద్ద పాప పెళ్లి కుదిరిందని ఇంతలో అప్పులు కోసం మానసికంగా బెంగపెట్టు కున్నారని అన్నారు. పురుగుల మందు తాగారని ఈ అప్పులన్నీ ఎరువులు కొట్టు వద్ద, మరో ముగ్గురు దగ్గర అప్పు తీసుకున్నామని తెలిపారు. కుటుంబ యజమాని మరణించడంతో తామంతా రోడ్డున పడ్డమన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తొలకరి పంట మునిగి దెబ్బతిందని, దాళ్వాపంట సాగునీరు లేక పంట దెబ్బతిన్నదన్నారు. సుమారు 7 ఎకరాలు కౌలు చేస్తున్నారని అన్నారు. కొంత భూమి దేవదాయ భూమి, కొంత భూమి ప్రైవేటు భూమి కౌలుకు చేస్తున్న సిసిఆర్‌సి కార్డు కోసం యజమాని సంతకం తప్పనిసరి కావడం వల్ల భూ యజమాని సంతకం లేని కారణంగా కార్డు రాలేదని అన్నారు. కనీసం ఈ క్రాప్‌లో చేర్చలేదని అయినప్పటికీ త్రిసభ్య కమిటీ విచారణ చేసి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతు మరణానికి ఇచ్చే పరిహారం రూ.7 లక్షలు ఇప్పించాలని, కౌలు రైతు చేసిన అప్పులన్నీ తీర్చాలని, ఇద్దరు ఆడపిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సలాది సత్య నారాయణ, కౌలు రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.