ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఆరోగ్యకరమైన దేశం కావాలంటే యువకులు, విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలని పాలకులు చెబుతున్నా ఆ దిశగా క్రీడాభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో నిధులను మంజూరు కావడం లేదు. ఫలితంగా క్రీడల్లో ఆసక్తి ఉన్నా క్రీడా స్థలాలు లేని స్కూళ్ళు అనేకం దర్శనమిస్తున్నాయి. ఒక వేళ స్థలాలు ఉన్నా మౌలిక వసతులు లేని మైదానాలు, తగిన ప్రోత్సాహం, శిక్షణ లేక ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. క్రీడలను అభివృద్ధి చేస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అందుకు అనుగుణంగా వసతులు కల్పించడం లేదు.
కాకినాడ జిల్లాలో 1,284 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1,63,203 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సరిపడా పిఇటి పోస్టులున్నా మెజారిటీ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ స్కూళ్లలో ఆట స్థలాలు లేవు. నిబంధనలు ప్రకారం ప్రతి స్కూల్లో కనీసం రెండెకరాల్లో ఆట స్థలం ఉండాలి. పాఠశాల విద్య స్థాయిలోనే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం చెబు తున్నా అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించడం లేదు. ఆట స్థలాల సౌకర్యం లేకుండానే పాఠశాలను ఏర్పా టు చేస్తు న్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మైదానాలు లేకుండానే చదువులు సాగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చలేకపోతున్నారు. కొన్ని చోట్ల క్రీడలను ఆడిస్తున్నా మొక్కుబడి తంతుగానే నిర్వహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం గానీ, విద్యాశాఖ అధికారులు గానీ క్రీడలపై ప్రత్యేక దృష్టిని సారించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర మైదానాలే దిక్కు
విద్యార్థి దశలోనే ఆటలు చాలా ముఖ్యమని వ్యాయమ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆటలతో మానసిక ఉల్లాసం, శారీరక దఢత్వం కలుగుతుంది. క్రీడాకారునిగా ఎదిగే క్రమంలో నాయకత్వ లక్షణాలు అలవడతాయి. క్రమశిక్షణ అలవాటు అవుతుంది. రోజులో కొంతసేపు ఆటలకు కేటాయిస్తే ఆరోగ్యంగా కూడా ఉంటారు. కానీ జిల్లాలో పలు ప్రభుత్వ స్కూళ్లలో అరకొర ఆట మైదానాలే దిక్కుగా ఉన్నాయి. విద్యాశాఖ కాకినాడ డివిజన్ పరిధిలో కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, కరప, కాజులూరు, పెదపూడి, తాళ్లరేవు, సామర్లకోట, యు.కొత్తపల్లి మండలాల్లో 110 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో కాకినాడ అర్బన్‌లో పరదేశిపేట హైస్కూల్లో ఆట మైదానం లేదు. సిబిఎం ఎయిడెడ్ హైస్కూల్, జగన్నాథపురం చర్చి స్కేర్ బాలికల హైస్కూల్లో సుమారు 1500 మంది చదువుతున్నారు. ఇక్కడ సరిపడా క్రీడా మైదానం లేదు. పిఆర్ బాలురు, బాలికల హైస్కూల్లో సుమారు వెయ్యి మంది చదువుతుండగా ఇక్కడా ఆట స్థలం సరిపడా లేదు. టౌన్ రైల్వే స్టేషన్ వద్ద, పగడాలపేట హైస్కూలులో కనీసం 20 సెంట్లలో కూడా స్థలం లేదు. పిఠాపురం ఆర్‌ఆర్ బిహెచ్‌ఆర్ హైస్కూల్, ఎకెపిఎం బాలుర, బాలికల మున్సిపల్ హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గ్రౌండ్లు లేవు. యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప, యండపల్లి, పిఠాపురం మండలం కందరాడ, సామర్లకోట మండలం వికె.రాయపురం, తాళ్లరేవు మండలం లక్ష్మీపతిపురం, పిల్లంక, పెదపూడి మండలం రామేశ్వరం, ఎపి.త్రయం, సామర్లకోట మున్సిపాలిటీలో యార్లగడ్డ అచ్చిరాజు మున్సిపల్ స్కూల్లో ఆట స్థలాలు అరకొరగానే ఉన్నాయి.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు క్రీడలను అలవాటు చేయాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆట స్థలాలను అభివృద్ధి చేసి క్రీడలకు నిధులను కేటాయించాలి. ప్రతి పాఠశాలకు క్రీడా సామాగ్రిని సమకూర్చాలి.
- లంక జార్జ్, రాష్ట్ర అధ్యక్షుడు,
పిఇటి, పీడీ సంఘం, కాకినాడ.










