
ప్రజాశక్తి-విజయనగరం : న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పలు క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించిన జిల్లాకు చెందిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందించారు. ఈ క్రీడల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఇద్దరు వ్యాయామ ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రశంసించారు. అఖిల భారత ఉద్యోగుల క్రీడల్లో మన రాష్ట్ర ఖో-ఖో జట్టు ద్వితీయ స్థానం సాధించగా రజత పతకం సాధించింది. ఈ జట్జులో గంట్యాడ మండలం పెదవేమలి జెడ్‌పి ఉన్నత పాఠశాలలో పిఇటిగా చేస్తున్న టి.ఎల్.పి. ప్రసన్నకుమార్ సభ్యునిగా పాల్గొన్నారు.
కబడ్డీ విభాగంలో మన రాష్ట్ర జట్టు తృతీయ స్థానం సాధించగా ఈ జట్టులో డెంకాడ మండలం రఘుమండ పిఇటిగా చేస్తున్న కూర్మాన భాను వున్నారు. వీరిరువురూ గురువారం జిల్లా కలెక్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో కలిసి తాము సాధించిన విజయాలను వివరించారు. జిల్లా కలెక్టర్ వారిని అభినందిస్తూ ఇతర ఉద్యోగులకు వారు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ బి.సహాదిత్ వెంకట్ త్రివినాగ్, డిఇఒ లింగేశ్వర రెడ్డి తదితరులు అభినందించారు.